భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఫ్లైట్స్

భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఫ్లైట్స్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సేఫ్ గా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రం చేసింది.  ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీతో కలిసి ఏర్పాట్లు చేస్తోంది. మన వాళ్లు తమ సమాచారం ఇచ్చి, ప్రయాణానికి సిద్ధమయ్యేలా 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ నుంచి హంగేరి, రుమేనియా దేశాల మీదుగా ఇండియాకు తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం ఎయిరిండియాకు చెందిన రెండు ప్రత్యేక విమానాలు రుమేనియాకు వెళ్లనున్నాయి. 

తొలి ఫ్లైట్ సాయంత్రం 4 గంటలకే..

భారత ప్రభుత్వ సూచనలతో ఇప్పటికే ఉక్రెయిన్ బార్డర్లకు మన స్టూడెంట్స్ చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి సుసీవా బార్డర్ ను దాటి రొమేనియాలోకి వందల సంఖ్యలో చేరుకుంటున్నారు. వీరిని బుకారెస్ట్ ఎయిర్ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి పోరుబ్నే సిరత్ దగ్గర బార్డర్ దాటి సుమారు 400 మందికి పైగా విద్యార్థులు రుమేనియా చేరుకున్నారని కీవ్ లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. రుమేనియా సరిహద్దుకు చేరుకుంటున్న భారతీయులందర్నీ బుకెరెస్ట్ కు తరలించి, అక్కడ్నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్ కు తరలిస్తామని పేర్కొంది. వారిని తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం AI-1942 బయలుదేరి వెళ్లింది. ఈ విమానం ఇవాళ అర్ధ రాత్రి 1.50 గంటల సమయానికి భారత పౌరులతో ఇండియా చేరుకోనుంది. అలాగే  మరో విమానం AI-1939 సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీ నుంచి  బయలుదేరనుంది. ఈ విమానం రేపు ఉదయం 7.40 గంటలకు తిరిగి ఢిల్లీకి రానుంది. ఈ రెండు విమానాల్లో కలిపి 490 మంది విద్యార్థులు భారత్ కు చేరుకోనున్నారు. ఇప్పటికే రుమేనియా వెళ్లిన మరో ఫ్లైట్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముంబైలో ల్యాండ్ అవ్వనుంది. ఇందులో 240 మంది స్వదేశానికి చేరుకోనున్నారు. వీరిని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ రిసీవ్ చేసుకుంటారు.

మరో రెండు విమానాలు..

ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు మరో రెండు విమానాలు కూడా వెళ్లనున్నాయి. వీటిలో ఒకటి రుమేనియా, మరొకిటి హంగేరికి చేరుకుని మన పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకొస్తాయి. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ఉక్రెయిన్ కు పొరుగున ఉన్న హంగేరి, రుమేనియాల ద్వారా తీసుకురానున్నట్లు ఉక్రెయిన్ లోని భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్ లో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా విద్యార్థులు

వార్‌పై రష్యాకు వ్యతిరేక తీర్మానం.. ఓటేయని భారత్

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ