బ్రీత్ ఎనలైజర్ టెస్టులో విఫలం.. మహిళా పైలట్‌ 3 నెలల సస్పెండ్

బ్రీత్ ఎనలైజర్ టెస్టులో విఫలం.. మహిళా పైలట్‌ 3 నెలల సస్పెండ్

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మహిళా పైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ప్రీ-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో విఫలమైనందున ఓ మహిళా పైలట్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు మంగళవారం(ఏప్రిల్ 9) ఆ సంస్థకు చెందిన ఒక అధికారి ధృవీకరించారు. 

బోయింగ్ 787 విమానాలకు ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పైలట్, గత వారం ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానంలో ప్రీ-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో విఫలమైనట్లు సమాచారం. సస్పెండ్ చేయబడిన లేడీ పైలట్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఎయిర్ ఇండియా ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

డీజీసీఏ నిబంధనల ప్రకారం, సిబ్బంది తప్పనిసరిగా ఫ్లైట్ డ్యూటీ వ్యవధిలో బయలుదేరే విమానాశ్రయంలో ప్రీ-ఫ్లైట్ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవాలి. వారు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో విఫలమైనప్పుడు కఠినమైన జరిమానాలు అమలు చేస్తారు. నేరం పునరావృతమైతే చర్యలూ మారుతుంటాయి. విమాన ప్రయాణానికి ముందు, తరువాతి పరీక్షలకు ఇది వర్తిస్తుంది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మొదటిసారి విఫలమైన పైలట్ ను మూడు నెలల పాటు విధుల నుండి సస్పెండ్ చేస్తారు.