గాలి కాలుష్యం ఎఫెక్ట్: గతేడాది 1.16 లక్షల మంది పసికందులు మృతి

గాలి కాలుష్యం ఎఫెక్ట్: గతేడాది 1.16 లక్షల మంది పసికందులు మృతి

న్యూఢిల్లీ: గాలి కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యంతో శ్వాస సంబంధిత సమస్యలతోపాటు ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్, అల్జీమర్స్, ఆటిజం లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా వెలువడిన ఓ రిపోర్టు ప్రకారం.. గాలి కాలుష్యం పెద్దలతో పాటు నవజాత శిశువులపైనా ప్రభావం చూపుతోందని తెలిసింది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్-2020 రిపోర్టు ప్రకారం.. 2019లో వాయు కాలుష్యం వల్ల భారత్‌‌లో 1.16 లక్షకుపైగా నెలలోపు వయస్సు ఉన్న శిశువులు చనిపోయారు. దీంట్లో దాదాపు సగం మరణాలకు కట్టెల పొయ్యి, పిడకలు, బొగ్గు కుంపట్ల లాంటి వాటితో వంట చేయడం వల్ల వెలువడే కాలుష్యమే కారణమని సదరు రిపోర్టు తెలిపింది.

హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌‌స్టిట్యూట్ (హెచ్‌‌ఈఐ1) అనే సంస్థ ఈ రిపోర్టును పబ్లిష్ చేసింది. ‘గాలి కాలుష్యం వల్ల గర్భధారణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అల్పాదాయ- మధ్య ఆదాయ దేశాల్లో నవజాత శిశువుల ఆరోగ్యం చాలా కీలకం. వాయు కాలుష్యం కారణంగా తక్కువ బరువుతో పుట్టడం, ముందస్తు జననాలు, పిల్లల ఎదుగుదల లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి’ అని ఈ స్టడీలో పాల్గొన్న హెల్త్ ఎక్స్‌‌పర్ట్ డాక్టర్ కల్పనా బాలకృష్ణన్ చెప్పారు.