టూరిస్టులు డిసప్పాయింటెడ్.. తాజ్ మహల్ ను కప్పేసిన పొగమంచు

టూరిస్టులు డిసప్పాయింటెడ్.. తాజ్ మహల్ ను కప్పేసిన పొగమంచు

నవంబర్ 6న ఐకానిక్ తాజ్ మహల్ సుందరమైన దృశ్యాన్ని సరిగ్గా ఆస్వాదించలేక పర్యాటకులు నిరాశకు గురయ్యారు. ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం మధ్య పొగమంచు దట్టమైన పొర ఆగ్రాను చుట్టుముట్టింది. దీంతో అందమైన స్మారక చిహ్నాన్ని తమ కెమెరాలో స్పష్టంగా బంధించడంలో దేశీయ, విదేశీ పర్యాటకులు నిరాశను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ భాను చంద్ర గోస్వామి ఓ సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. నిర్మాణ స్థలాల్లో నీళ్లు చల్లాలని అధికారులను కోరారు.

పర్యాటకులు ఎలా స్పందిస్తున్నారంటే..

తాజ్‌మహల్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో చిత్రీకరించడంలో పర్యాటకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారని స్థానిక టూర్ గైడ్ షకీల్ రఫీక్ చెప్పారు. "నవంబర్ 5న నేను జర్మనీకి చెందిన ఒక వృద్ధ దంపతులతో ఉన్నాను. మేము ఉదయం 8 గంటలకు స్మారక చిహ్నాన్ని సందర్శించాం. కానీ దూరం నుండి తాజ్‌ను సరిగ్గా చూడలేకపోయాం, ఇది వారిని నిరాశపరిచింది" అని రఫీక్ చెప్పారు.

పోలాండ్ నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే వారు కూడా ఉదయం స్మారక చిహ్నాన్ని వీక్షించలేకపోయారు. మధ్యాహ్నం వారి సందర్శనను తిరిగి షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఇది పర్యాటకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆగ్రా టూరిజం గిల్డ్ ప్రెసిడెంట్ రాజీవ్ సక్సేనా అన్నారు. అమెరికాకు చెందిన నలుగురు పర్యాటకులు తాజ్ మహల్‌ను సందర్శించిన తర్వాత నగరంలోని ఇతర స్మారక చిహ్నాల పర్యటనను వారు సరిగ్గా చూడలేకపోవడంతో క్యాన్సిల్ చేసుకున్నారని ఆయన చెప్పారు. సక్సేనా ప్రకారం, తాజ్ సమీపంలో నిర్మాణ కార్యకలాపాలు గత మూడేళ్లలో పరిస్థితిని మరింత దిగజార్చాయి.