రైలంటే ఎట్లుండాలి? బోగీలుండాలి. పట్టాలుండాలి. ఆ పట్టాలపై రైలు నడవాలి. ‘ఇట్ల జేస్తే మమ్మల్నెవడు గుర్తిస్తడు’ అనుకుంది చైనా. తమ రైలును చూసి జనాలు ‘అబ్బా’ అనాలనుకుంది. అన్నట్టే చక్రాల్లేని రైలును తీసుకొచ్చింది. చక్రాలుండవు కదా అని పట్టాలుండవనుకునేరు. ఉంటాయి. కానీ వాటిని రైలు తాకదు. గాల్లోనే తేలుతూ వెళ్తుంది. పోతదంటే ఏ వందో, రెండొందలో కాదు గంటకు 600 కిలోమీటర్ల స్పీడు మరి. అయస్కాంత క్షేత్ర ప్రభావం(మ్యా గ్నెటిక్ లెవిటేషన్)తో నడుస్తదీ రైలు. చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ క్వింగ్ డావో సిఫాంగ్ కో సంస్థ డెవలప్ చేసింది. ఈ ఏడాది చివరలో రైలు ట్రయల్స్ నడుస్తాయని సంస్థ వెల్లడించింది. రైలు అందుబాటులోకి వస్తే విమానయాన రంగానికి గట్టిపోటీనిస్తుందని చెప్పింది.
