- నేడు రాజ్యసభ ముందుకు బిల్లు
- వైసీపీ వాకౌట్.. మూజువాణి ఓటుతో ఆమోదం
న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వకౌట్ చేయగా.. మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును బుధవారం లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై చర్చను ప్రారంభించారు.
బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు రఘురామ్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ), అరవింద్ గణపతి సావంత్ (శివసేన, ఠాక్రే), భజ్రంగ్ మనోహర్ (ఎన్సీపీ), రాజేశ్ రంజన్ (ఇండిపెండెంట్), హర్ సిమ్రాత్ కౌర్ (ఎస్ఏడీ), శ్రీకాంత్ షిండే (శివసేన) సహా మొత్తం 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లుపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.
పెండింగ్‌లోనే ఏపీకి ప్రత్యేక హోదా...
కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ చర్చను ప్రారంభిస్తూ అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని చెప్పారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కోరారు. అమరావతి కేవలం రాజధాని కాదని, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలని, ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు.
