- టామ్ కామ్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- జర్మనీ, జపాన్ దేశాల్లో నర్సులకు భారీ డిమాండ్ ఉంది
- ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలపై అధ్యయనానికి త్వరలో టీమ్‌ను పంపిస్తం
- మాసబ్ ట్యాంక్‌లో టామ్ కామ్ భవనం పరిశీలన
హైదరాబాద్, వెలుగు: జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సులకు భారీ డిమాండ్ ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆ దేశాల్లో నర్సులకు నెలకు రూ.2 లక్షల వరకు జీతాలు వస్తున్నాయన్నారు. టామ్ కామ్ ఆధ్వర్యంలో విదేశాల్లో తెలంగాణ నిరుద్యోగులు నెలకు లక్షల వేతనాలతో ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు. బుధవారం మాసాబ్ ట్యాంక్‌లో టామ్ కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ)కి టీజీఐఐసీ కేటాయించిన బిల్డింగ్‌ను కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్, జీఎం నాగభారతితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ బిల్డింగ్‌లో జరుగుతున్న రెనోవేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. జర్మనీలో ఉద్యోగావకాశాలను అధ్యయనం చేయడానికి త్వరలో ఓ ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగానికి అవసరమైన 1,000 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, అక్కడ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందని తెలిపారు.
పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే అవకాశాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్‌లో విదేశాల్లో ఉద్యోగాలు పొందే విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించేలా ఈ కార్యాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో టామ్ కామ్ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో టామ్ కామ్ కోసం రూ.90 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. విదేశాలకు వెళ్లే అభ్యర్థులకు అక్కడి సంస్కృతి, భాష, జీవన విధానం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో (ఏటీసీలు) చదివే విద్యార్థుల కోసం సీఎం ప్రవేశపెట్టిన రూ.2 వేల స్కాలర్‌షిప్ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కేంద్రాల్లో చదువుతున్న వారిలో ఆసక్తి ఉన్న అభ్యర్థులను గుర్తించి విదేశీ ఉపాధికి అనుగుణంగా శిక్షణ ఇస్తామని తెలిపారు.
విదేశీ ఉద్యోగ అవకాశాలను ఆశించే యువత టామ్ కామ్‌లో పేరు నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం టామ్ కామ్‌కు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశలు ఎక్కువగా ఉన్నా స్కిల్డ్ ఎంప్లాయీస్ లేరని కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్ తెలిపారు. నిరుద్యోగులు కావాలని, ఎక్కువ వేతనాలు ఇస్తామని పలు దేశాలు టామ్ కామ్‌ను కోరుతున్నాయని చెప్పారు. నెల రోజుల్లో ఈ బిల్డింగ్ మరమ్మతులు పూర్తి చేసి, ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది నిరుద్యోగులను విదేశాలకు పంపించడమే టామ్ కామ్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి..
అర్హత ఉన్న డాక్టర్‌ను ఈఎస్‌ఐ డైరెక్టర్‌గా నియమించాలని ఉద్యోగుల జేఏసీ మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరింది. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న ఈఎస్‌ఐ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం సెక్రటేరియెట్‌లో మంత్రిని కలిసి, వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలన్నారు. అవసరమైన మెడికల్ సర్జికల్ వినియోగ సామగ్రి సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడం, కీలక పరికరాల కోసం ఏఎంసీ, సీఎంసీ సేవలను తిరిగి ప్రారంభించడం, రోగులు, సిబ్బందికి డైట్ సేవలను తిరిగి ప్రారంభించాలని కోరారు. త్వరలో ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
