- స్మార్ట్‌ఫోన్‌తో ఇంటి నుంచే భూ సేవలు
- రోవర్లతో భూసర్వే.. ఏడు రోజుల్లోనే సర్వే పూర్తి.. ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ అలర్ట్స్
- ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్ నెంబర్ ఇస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: -రాష్ట్రంలోని 5 మండలాల్లో గురువారం నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో దీన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. ఆయా జిల్లా కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
బుధవారం కేరళ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. భూభారతి పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రైతు కోణంలో రూపొందించామని చెప్పారు. రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను తయారు చేసినట్టు తెలిపారు. ఈ పోర్టల్‌ను ఈ నెల 2వ తేదీ నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ వచ్చే ఫలితాలకు తగ్గట్టుగా అవసరమైన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.
భూ సేవల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా..
రైతులు గతంలో మాదిరిగా తమ భూ సేవల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా తమ ఇంటి నుంచే భూ సేవలు పొందేలా పోర్టల్‌ను రూపొందించామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంలో రైతులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరిగేవారని,. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే భూభారతి పోర్టల్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ‘‘రైతు లాగిన్ అయిన వెంటనే తనకున్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంతచెల్లించాలో కనిపిస్తుంది. ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్ లాగిన్‌కు వెళ్తాయి.
ఆ తర్వాత రెండు రోజల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారు. తర్వాత ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెన్స్‌డ్ సర్వేయర్ ఖరారు చేయడమేగాక సర్వేకూడా రోవర్లతో పూర్తి చేస్తారు. దీనిని సిస్టమ్‌లో నమోదు చేశాక అది మండల సర్వేయర్ స్య్రూటినీకి వెళ్తుంది. ఆపై తహసీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్‌పీఎం, భూధార్ నంబర్ల కేటాయింపు చేస్తారు. ఈ వివరాలు భూభారతి పోర్టల్‌లో కూడా నిక్షిప్తమవుతాయి.
రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాపు జత
సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యామ్‌ను జనరేట్ చేసి భూభారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు ప్రతి దశలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తారని చెప్పారు. భూభారతి చట్టంలో పేర్కొన్నవిధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇక్కడ ప్రతి సర్వే మ్యాప్ ( ఎల్‌పీఎం) యూనిక్ నెంబర్‌తోపాటు ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా ఇస్తామని వెల్లడించారు. ఈ 5 మండలాల్లో రైతులు దరఖాస్తు చేసుకున్న తర్వాత సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని, అలాగే గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్‌లాంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని, కచ్చితమైన సర్వే వివరాలు వస్తాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
