- ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,167 మరణాలు
- 60 రోజులపాటు కఠిన నియంత్రణలు
- ఆన్‌లైన్ అమ్మకాలపైనా నిఘా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన గడ్డిమందుగా గుర్తించిన పారాక్వాట్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వు నెం.24 జారీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి వచ్చి, వచ్చే 60 రోజులపాటు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై పూర్తిగా ఆంక్షలు అమలవుతాయని చెప్పారు.
పారాక్వాట్ అత్యంత విషపూరితమైన రసాయనమని, చర్మం, కండ్ల ద్వారా శరీరంలోకి వెళ్లినా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, ఇప్పటివరకు రాష్ట్రంలో 1167 మరణాలు నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి పారాక్వాట్ అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆన్‌లైన్ విక్రయాలపైనా నిఘా పెంచాలని అధికారులకు ఆదేశించారు. రైతులు ప్రత్యామ్నాయ గడ్డిమందులను వాడాలని సూచించారు.
ఇదిలా ఉండగా, సచివాలయంలో వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సహజ వ్యవసాయం, పంట మార్పిడి, యాంత్రీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమతిలేని హెచ్‌టి పత్తి విత్తనాల కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
31వేల ఎకరాల్లో పంట నష్టం..
ఇటీవల కురిసిన వర్షాల వల్ల 86 మండలాల్లో 31,504 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. మొక్కజొన్న, వరి, నువ్వులు, జొన్న వంటి మపంటలు ప్రభావితమయ్యాయి. పూర్తి నివేదిక త్వరగా ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. యూరియా సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఏప్రిల్ నెలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయించినట్లు తెలిపారు.
గ్రామాల్లో నేల ఆరోగ్యంపై అవగాన కల్పిస్తామని, భూసార పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్రిశాట్‌లో 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సరీ ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులను లాభదాయకమైన పంటల వైపు దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
