హైదరాబాద్, వెలుగు: అధికారాన్ని అడ్డం పెట్టుకొని మావోయిస్టులను భౌతికంగా అంతం చేయవచ్చేమో గానీ, మావోయిజానికి మూలమైన కమ్యూనిజాన్ని ఎవరూ అంతం చేయలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో గల సీపీఐ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర వేస్తూ వేధింపులకు గురిచేసే పాలకులు చేసిన చట్టాలకు వారే బందీలవుతారని, అవే వారికి ఉరితాళ్లు అవుతాయని హెచ్చరించారు.
మావోయిస్టుల హననమే లక్ష్యంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటు చేసిన సల్వాజుడుంను సుప్రీం కోర్టు రద్దు చేసిందని, ఆ తీర్పును ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అపహస్యం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులు, ముస్లింలు క్రైస్తవంలోకి మారితే వారికి అంతకు ముందున్న కులం గానీ, రిజర్వేషన్లు గానీ వర్తించవని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అన్యాయమన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు అన్ని వర్గాల నిపుణులతో కమిటీ వేసి, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆయన కోరారు.
