హెయిర్ హోస్టస్ డెత్ మిస్టరీ.. ప్రియుడే చంపేశాడా..

హెయిర్ హోస్టస్ డెత్ మిస్టరీ.. ప్రియుడే చంపేశాడా..

బెంగళూరులో హెయిర్ హోస్టస్ అర్చన డెత్ మిస్టరీ వీడింది. మార్చి 11వ తేదీ బెంగళూరు సిటీ శివార్లలోని అత్యంత ఖరీదైన ప్రాంతం అయిన కోరమంగళలోని రేణుఖా రెసిడెన్సీ సొసైటీలోని ఓ అపార్ట్ మెంట్ పై నుంచి పడి ఆమె చనిపోయింది. ప్రమాద వశాత్తు పడిపోయినట్లు అందరూ భావించినా.. అర్చన తల్లి కంప్లయింట్ తో.. ప్రియుడు ఆదేశ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

అర్చన – ఆదేశ్​ ఆరు నెలలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. డేటింగ్ యాప్ ద్వారా వీరి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు బయటపడింది. వారం క్రితం దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన అర్చన.. ఆదేశ్ తో కలిసి ఉంది. మార్చి 11వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. గొడవ పెద్దది కావటంతో.. బాల్కనీ నుంచి అర్చనను తోసేసినట్లు ప్రాథమిక అనుమానాలతో ప్రియుడు ఆదేశ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. 

అర్చన – ఆదేశ్ తరచూ గొడవలు పడేవారని.. ఈ విషయం నా కుమార్తె స్వయంగా చెప్పినట్లు అర్చన తల్లి పోలీసులకు కంప్లయింట్ చేసింది. పెళ్లి చేసుకోవాలన్న డిమాండ్ పై.. ఆదేశ్ నాటకాలు ఆడుతున్నాడని.. అర్చనను వదిలించుకోవాలనే కుట్రలో భాగంగానే.. బాల్కనీ నుంచి తోసి చంపినట్లు చెబుతుంది. కేసు విచారణలో కొన్ని అంశాలపై అనుమానాలు తలెత్తటంతో.. తల్లిదండ్రులు సైతం హత్యగా భావిస్తుండటంతో.. ప్రియుడు ఆదేశ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. 

ఆదేశ్ మాత్రం తన తప్పు లేదని చెబుతున్నాడు. బాల్కనీ నుంచి జారి.. కింద పడిందని.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు డాక్టర్లు చెప్పినట్లు చెబుతున్నాడు. అన్ని కోణాలు విచారణ చేసిన పోలీసులు.. ఆదేశ్ పాత్ర ఉందన్న అనుమానంతోపాటు అతనిపై హత్య కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. బెంగళూరు సిటీలో కలకలం రేపిన ఈ హెయిర్ హోస్టస్ హత్యలో ఇంకా ఏమైనా మిస్టరీ దాగుందా అనే కోణంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.