
- ఎయిర్‌లైన్స్ కంపెనీల లిమిటెడ్ ఆఫర్లు
- ప్యాసెంజర్లను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నం
- కరోనా తర్వాత బాగా కుదేలైన ఏవియేషన్
- డిమాండ్ పెంచేందుకు డిస్కౌంట్ ఆఫర్స్
బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనాతో రెక్కలు తెగి కొట్టుమిట్టాడుతోన్న ఏవియేషన్ సెక్టార్.. మళ్లీ కోలుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్యాసెంజర్లను ఆకట్టుకోవడం కోసం భారీ డిస్కౌంట్లతో స్పెషల్ సేల్స్‌ను ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. డిస్కౌంట్ సేల్స్‌లో భాగంగా తక్కువ రేట్లకే విమాన టిక్కెట్లను అందిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ మార్కెట్‌లోకి రావడంతో ఎయిర్ ట్రావెల్ మళ్లీ రెక్కలు కట్టుకుని ఎగరనుందని ఇండస్ట్రీ ఇన్‌సైడర్లు చెబుతున్నారు. దీని కోసం ముందస్తుగానే ఎయిర్‌లైన్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. తక్కువ ధరలకే టిక్కెట్లను ఆఫర్ చేయడం, మార్కెట్ షేరును పొందేందుకు ప్రయత్నించడం, మళ్లీ కెపాసిటీని ముందటి స్థాయిలకు తీసుకురావడం చేస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో, స్పైస్‌జెట్‌లు స్పెషల్ సేల్స్‌ను ప్రకటించగా.. తాజాగా గోఎయిర్ కూడా వీటి లిస్ట్‌లో చేరిపోయింది..
బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ రిపబ్లిక్ డేకి ముందు లిమిటెడ్ పిరియడ్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా పది లక్షల సీట్లను సేల్‌కు ఉంచింది. వీటి ధర కేవలం రూ.859 నుంచే ప్రారంభమవుతుంది. ఈ స్కీమ్ కింద టిక్కెట్లను జనవరి 22(శుక్రవారం) నుంచి జనవరి 29(వచ్చే శుక్రవారం) వరకు బుక్ చేసుకోవచ్చని గోఎయిర్ తెలిపింది. ఈ టిక్కెట్ల ట్రావెల్ పిరియడ్ ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుందని పేర్కొంది. ఈ సేల్ కేవలం వన్–వే విమాన టిక్కెట్లకే వర్తిస్తుంది. ఈ సేల్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు డిపార్చర్ అయ్యే 14 రోజుల లోపల జీరో ఫీజులతో టిక్కెట్లను ఛేంజ్ చేసుకోవచ్చు. ప్రోమో ఫేర్ సీట్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. అద్భుతమైన ఈ రిపబ్లిక్ డే ఎయిర్ టిక్కెట్ సేల్‌లో ట్రిప్స్‌ను ప్లాన్ చేసుకుని సేవింగ్స్ పొందాలని గోఎయిర్ పేర్కొంటోంది. అటు స్పైస్‌జెట్, ఇండిగోలు తెచ్చిన స్పెషల్ టిక్కెట్ ఆఫర్లలో కూడా విమాన టిక్కెట్లు చాలా చౌకగా లభ్యమయ్యాయి. స్పైస్‌జెట్ కేవలం రూ.899కే విమాన టిక్కెట్‌ను ఆఫర్ చేయగా.. ఇండిగో రూ.877కే ఫ్లయిట్ టిక్కెట్‌ను ఇచ్చింది. ఈ రెండింటి ఆఫర్ 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 వరకున్న ట్రావెల్‌కు వర్తిస్తుంది. స్పైస్‌జెట్ కూడా జీరో ఫీజులతో టిక్కెట్ల తేదీలను మార్చుకునే అవకాశాన్ని, క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తారా కూడా తన ఆరవ వార్షికోత్సవ సందర్భంగా డొమెస్టిక్ ఎయిర్‌ఫెయిర్స్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రమోట్ చేసే ట్రూజెట్ కూడా ట్రూ–రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా రూ.926 నుంచే టిక్కెట్ల ధరలు ప్రారంభమయ్యాయి. జనవరి 23(శనివారం) నుంచి జనవరి 27(బుధవారం) వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రావెల్ పిరియడ్ ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటుంది.
రూ.14,600 కోట్లుగా నష్టాలు..
కరోనాతో ట్రావెల్ ఆంక్షలు విధించడంతో ఏవియేషన్ ఇండస్ట్రీ బాగా పతనమైంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం దేశీయ ఏవియేషన్ ఇండస్ట్రీ నికర నష్టాలు ఈ ఏడాది రూ.14,600 కోట్లుగా ఉండొచ్చని అంచనాలున్నాయి. 2021–22లో దేశీయ ఎయిర్ ప్యాసెంజర్ ట్రాఫిక్‌లో గ్రోత్ ఉండొచ్చని ఈ రేటింగ్ ఏజెన్సీ చెబుతోంది. మెల్లమెల్లగా ఆఫీసులు ప్రారంభం కావడం, ట్రావెల్ ఆంక్షలు తొలిగిపోవడం ఎయిర్ ట్రావెల్ పెరిగేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. విమాన టిక్కెట్ ధరలు తక్కువగా ఉండటం కూడా డిమాండ్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.
ముందస్తుగానే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు..
2020 డిసెంబర్‌లో అగ్రిగేట్ ప్యాసెంజర్ ట్రాఫిక్ 73.27 లక్షలుగా ఉంది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో 43.7 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ సమయంలో డిమాండ్‌ను పెంచేందుకు ఎయిర్‌లైన్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను తెచ్చాయి. దేశీయ, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెచ్చిన డిస్కౌంట్స్ ఆఫర్స్ ఈ ఏడాది వెకేషన్‌ను ప్లాన్ చేసుకునే ట్రావెలర్స్‌ను ఆకర్షించనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. విమాన ప్రయాణికులు తమ ట్రిప్స్‌ను ముందస్తుగా ప్లాన్ చేసుకునేందుకు కూడా ఈ డిస్కౌంట్లు ఉపయోగపడనున్నాయని చెప్పాయి. ఈ ఏడాది ప్రీ కరోనా లెవెల్స్‌కు బుకింగ్స్ చేరుకుని విమాన ఇండస్ట్రీ రికవరీ అవుతుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఇండస్ట్రీ ప్లేయర్లు ప్రీ కరోనా కెపాసిటీకి 80 శాతమే ఆపరేట్ చేయాలని ఆంక్షలు విధించింది. కరోనా పరిస్థితులతో డిమాండ్‌పై ప్రభావం పడటంతో.. చాలా ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇంకా గ్రౌండ్‌కే పరిమితమయ్యాయి. పూర్తి స్థాయిలకు ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ రావడానికి ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. కచ్చితంగా ఈ రంగం బౌన్స్ బ్యాక్ అవుతుందన్నారు.