గుడ్లగూబ కోసం.. ఆగిన క్వారీ పనులు..గుడ్లు పెట్టి పొదుగుతోందని పనులు వాయిదా

గుడ్లగూబ కోసం.. ఆగిన క్వారీ పనులు..గుడ్లు పెట్టి పొదుగుతోందని పనులు వాయిదా
  • అరుదైన గుడ్లగూబ కావడంతో ..ప్రతి రోజు పర్యవేక్షిస్తున్న ఆఫీసర్లు

వికారాబాద్, వెలుగు : ఓ గుడ్లగూబ కోసం క్వారీ పనులను నిలిపివేశారు. ఈ ఘటన వికారాబాద్‌‌ జిల్లా మోమిన్‌‌పేట మండలంలోని ఎన్కతల గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... ఎన్కతల గ్రామ శివారులోని ఓ క్వారీ వద్ద గుడ్లగూబను గుర్తించిన జేసీబీ వర్కర్‌‌ ఈ విషయాన్ని హైదరాబాద్‌‌కు చెందిన వైల్డ్​లైఫ్‌‌ ఫొటోగ్రాఫర్‌‌ మనోజ్‌‌కు చెప్పాడు. అతడు క్వారీ వద్దకు వెళ్లి గుడ్లగూబ ఫొటోలు తీసి ఫారెస్ట్‌‌ ఆఫీస్‌‌కు పంపించాడు. 

ఫొటోలను పరిశీలించిన ఆఫీసర్లు.. అరుదైన ఇండియన్‌‌ రాక్‌‌ ఈగల్‌‌ ఓవల్‌‌గా గుర్తించి జిల్లా ఫారెస్ట్‌‌ ఆఫీసర్‌‌ జ్ఞానేశ్వర్‌‌ ద్వారా మోమిన్‌‌పేట బీట్‌‌ ఆఫీసర్‌‌ మహేశ్, సెక్షన్‌‌ ఆఫీసర్‌‌ ఇనాయత్‌‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం క్వారీ యజమాని లక్ష్మారెడ్డిని సంప్రదించారు. గుడ్లగూబ ఐదు గుడ్లు పెట్టి వాటిని పొదుగుతుందని, దానిని డిస్టర్బ్‌‌ చేయవద్దని సూచించడంతో అతడు క్వారీ వద్ద పనులను నిలిపివేశాడు. ప్రస్తుతం గుడ్ల నుంచి మూడు పిల్లలు బయటకు వచ్చాయి.

 గుడ్లగూబ ఉన్న రెండు ఎకరాల వదిలేసి మిగతా ప్రాంతంలో మైనింగ్‌‌ చేస్తున్నారు. ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు ప్రతిరోజు ఆ ప్లేస్‌‌కు వెళ్లి గుడ్లగూబ ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపుతున్నారు. ఆ పిల్లలు ఎగిరి వెళ్లడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌‌ తెలిపారు.