రాధేశ్యామ్​లో ఎయిర్​టెల్ గర్ల్

రాధేశ్యామ్​లో ఎయిర్​టెల్ గర్ల్

ఆమె ఒక సింగర్​, లిరిసిస్ట్‌‌, మ్యుజీషియన్, మోడల్, యాక్ట్రెస్​. చిన్నప్పటి నుంచి యాక్టింగ్​ మీద తనకి ఉన్న ఆ ఇష్టంతో టీనేజ్​ నుంచే అటు​ వైపు అడుగులు వేసింది. మొదట యాడ్ ఫిల్మ్స్​లో యాక్ట్ చేసింది. వాటిలో ఒకటి ఆమెను ప్రపంచానికి పరిచయం చేసింది. దాంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్​లో ఆఫర్లు వచ్చినా, మొదటి సినిమా చేసేందుకు టాలీవుడ్​ను సెలక్ట్ చేసుకుంది. అంతేకాదు, తను తెలుగులో చేసిన రెండో సినిమా పాన్​ ఇండియా మూవీ కావడం విశేషం. అదే, కొత్త సంవత్సరం మొదటి నెలలో రాబోతున్న ప్రభాస్​ సినిమా ‘‘రాధేశ్యామ్’’. ఇందులో ఆమె ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది. ఎవరా లక్కీ గర్ల్ అంటే సాషా ఛెత్రి. ఈ పేరు కంటే బహుశా ఎయిర్​టెల్​ 4జీ గర్ల్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారేమో! సాషాను వాళ్లమ్మ సింగర్​గా చూడాలనుకుందట. అందుకే తనకి ఐదో ఏడు నుంచే పాటలు పాడటం నేర్పించిందట. వాళ్ల నాన్న గిటార్ ప్లే చేయడం నేర్పించారు. కానీ, సాషాకి వీటితోపాటు యాక్టింగ్​ అంటే చాలా ఇష్టం. దాంతో పాటలు రాస్తూ, పాడుతూ, ఆల్బమ్స్​ చేస్తూనే యాక్టింగ్ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

రిక్షారాణి
సాషా నిక్​ నేమ్ ‘రిక్షారాణి’. ‘రిక్షారాణి’ ఆల్బమ్​ హిట్​ కావడంతో తన నిక్ నేమ్ రిక్షారాణి అయిపోయింది. సాషా ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ పేరు కూడా ఇదే. ఈ ఆల్బమ్​ చేయడానికి కారణం ముంబైలో సాషా ఎక్కువసార్లు రిక్షాలో జర్నీ చేయడమే. వాళ్ల కష్టం తెలిసి రిక్షావాళ్లకు ట్రిబ్యూట్​గా ఈ ఆల్బమ్​ చేసింది. రైటింగ్, సింగింగ్, గిటార్ ప్లే చేయడం సాషా హాబీలు. సాషా ఛెత్రిది డెహ్రాడూన్​. నవంబర్ 26, 1996లో పుట్టింది. సాషా తండ్రి అరుణ్​ కుమార్​ ఛెత్రి, తల్లి మీనా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే సాషాకి చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్​తోనే డెహ్రాడూన్​ నుంచి ముంబై వచ్చింది. ‘‘జేవియర్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ కమ్యూనికేషన్స్’’లో అడ్వర్టైజింగ్​లో డిగ్రీ చదివింది. 

ఆ యాడ్​ చేయనని...
సాషా చదువుకుంటూనే కాపీ రైటర్​గా పనిచేసింది. తర్వాత ‘‘కట్టి బట్టి” అనే సినిమాలో మ్యుజీషియన్​గా చిన్న రోల్​లో కనిపించింది. యాక్టర్​ అవ్వాలనే ఆశతో మోడలింగ్​లోనూ అడుగుపెట్టింది. అప్పుడే ఎయిర్​ టెల్​ 4జీ క్యాంపెయిన్​ కోసం ఆడిషన్​ జరుగుతోందని తెలిసింది. ‘‘ఇదేదో బాగుంది. ట్రై చేద్దాం’’ అని ఆడిషన్​కి వెళ్లింది. ఆ క్యాంపెయిన్​ కోసం తనని సెలక్ట్​ చేశారు. కాకపోతే హెయిర్​ కట్ చేసుకోవాలని చెప్పారు. మొదట సాషా అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే తనది చాలా పొడవైన జుట్టు. జుట్టు కట్ చేసుకోవడం ఇష్టం లేక ‘యాడ్ చేయను’ అని చెప్పిందట. కానీ, తర్వాత మళ్లీ తనే ఒప్పుకుని, ఆ యాడ్​లో నటించింది. ఆ యాడ్​ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. 

ఒక సర్వే ప్రకారం దాదాపు రెండు నెలలు ఎక్కువసార్లు స్ర్కీన్​ మీద కనిపించిన ఫేస్​ ఎవరిది? అంటే సాషా ఛెత్రినే అని తెలిసింది. అదలా ఉంటే... ఆమె చేసిన ఆ యాడ్... టీవీ, సెల్​ఫోన్​, రేడియోల్లో ఎక్కువ సార్లు వస్తుండడంతో ప్రజలకు చిరాకు తెప్పించిన బ్రాండ్​ కూడా అదేనని మరో సర్వేలో తెలిసింది. ఇలా సాషా ఆ యాడ్ చేసిన తర్వాత పాపులారిటీతో పాటు, ట్రోల్స్, నెగెటివిటీని ఫేస్​ చేయాల్సి వచ్చింది. ఆ నెగెటివినీ ఎలా డీల్ చేశారని అడిగితే ‘‘డీల్ చేయడం కంటే మైండ్​లో నుంచి డిలిట్ చేయడం ఈజీ. వాటి గురించి ఎక్కువ మాట్లాడటం, రియాక్టవడం టైం వేస్ట్. ఒక పబ్లిక్​ ఫిగర్​ అయిన తర్వాత ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నా.. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మంచిని తీసుకుని, నెగెటివ్​ని అవాయిడ్​ చేయడం బెటర్​”అంటోంది  సాషా. 

ఎయిర్​ టెల్ 4జీతోపాటు, సన్​ ఫీస్ట్ బిస్కెట్​, నుస్రత్ గ్రీన్​ టీ ప్రొడక్ట్స్​ యాడ్స్​లో కూడా నటించింది. అయితే ఎయిర్​ టెల్ 4జీ యాడ్ లాంచ్​ చేశాక ఆమె ఆ యాడ్ నుంచి తప్పుకుంది. తర్వాత రిలయన్స్​ జియో యాడ్ చేసింది. ఎందుకు తప్పుకుందనే విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఆ యాడ్ చేసినప్పుడు తను ఎదుర్కొన్న ట్రోల్స్​, నెగెటివిటీ వల్లే తప్పుకుందని సోషల్​ మీడియాలో టాక్​. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2021, జూన్​లో మళ్లీ ఎయిర్​ టెల్ యాడ్​ క్యాంపెయిన్​లో కనిపించింది సాషా. 

తెలుగులోనే తొలి సినిమా
సాషా ముంబైలో థియెటర్​ వర్క్​షాప్స్​ కూడా చేసింది. అయితే ఎయిర్​ టెల్ యాడ్​తో పాపులర్​ అయిన ఆమెకి బాలీవుడ్ నుంచి సినిమా, సీరియల్​ ఆఫర్లు వచ్చాయి. కానీ, సాషా ఒప్పుకోలేదు. ఆ తర్వాత తెలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటిలో సాషాకి ఒక కథ నచ్చింది. అదే ఆది సాయికుమార్​ హీరోగా 2019లో వచ్చిన ‘‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్​”మూవీ. ఆ సినిమాలో మెయిన్​ లీడ్​గా చేసింది. ఆ మూవీ డైరెక్టర్​ సాయి కిరణ్​ అడివి. ఆయన సోషల్ మీడియాలో సాషా ఫొటోలు చూసి తనని మూవీ కోసం అప్రోచ్​ అయ్యారట. ఈ సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చడంతో సాషా ఈ ప్రాజెక్ట్ ‘ఓకే’ చేసింది. అయితే, తన మొదటి సినిమాకి రెమ్యునరేషన్​ తీసుకోకూడదని అనుకుందట. అందుకని తన ఫస్ట్ సినిమా ఇదే కావడంతో రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ సినిమాలో నటించింది సాషా. ఈ సినిమా తనదాకా రావడానికి కారణం టాలీవుడ్​లో యాక్టింగ్ గురుగా పరిచయం ఉన్న మహేశ్ గంగిమల్ల అని కొన్ని ఇంటర్వ్యూల్లో సాషా చెప్పింది. తెలుగులో సాషా ఫేవరెట్​ హీరోలు విజయ్ దేవరకొండ, మహేష్​ బాబు.

అది జోక్​ అనుకున్నా..
‘‘నాన్న ఎక్స్​ ఆర్మీ ఆఫీసర్. ఆర్మీ ఫ్యామిలీలో పెరగడం వల్ల ఎప్పుడూ యాక్టింగ్, మోడలింగ్ ఆలోచనలు రాలేదు. ఎక్కువ చదువు మీదే శ్రద్ధ ఉండేది. పైగా చిన్నప్పుడు నేను చాలా సైలెంట్​. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే షైగా ఫీలయ్యేదాన్ని. దానివల్ల నాకు ఫ్రెండ్స్​ కూడా తక్కువే. అయితే నన్ను సింగర్​గా చూడాలనేది మా అమ్మ కోరిక. దాంతో సింగింగ్ ప్రాక్టీస్ చేశా. రకరకాల పోయెమ్స్​ చదవడమంటే ఇంట్రెస్ట్. వాటి నుంచి ఇన్​స్పైర్​ అయ్యి నేను సొంతంగా పాటలు రాయడం మొదలుపెట్టా. నా ఆల్బమ్స్‌‌కి నేనే పాట రాసి, పాడి, మ్యూజిక్ కంపోజ్​ చేస్తాను. మ్యూజిక్​ ఆల్బమ్ వీడియోలు అప్ లోడ్ చేయడంతో కొంత గుర్తింపు వచ్చింది. నేను చదివింది అడ్వర్టైజింగ్ కాబట్టి అటు వైపు కూడా నా లక్​ టెస్ట్​ చేసుకుందామని కొన్ని అడ్వర్టైజింగ్​ కంపెనీలకు అప్లై చేశా. ఆడిషన్​ కూడా ఇచ్చా. వాటిలో ఛాన్స్​ రాలేదు. అప్పుడు నా ఫ్రెండ్స్​ ఫోన్​ చేసి ‘నువ్వు సెలక్ట్ అయ్యావ్’ అని సరదాగా ఏడిపించేవాళ్లు. ఎయిర్​ టెల్ యాడ్​ ఆడిషన్​ తర్వాత ఆ కంపెనీ నుంచి కాల్ వచ్చింది.. ‘సెలక్ట్ అయ్యావ్. కాకపోతే జుట్టు కత్తిరించుకోవాలి’​ అని చెప్పారు. అది వినగానే నా ఫ్రెండ్స్​ నన్ను ఏడిపించడానికి అలా చేస్తున్నారని నవ్వుకున్నా. అస్సలు నమ్మలేదు. వాళ్లు ‘కాదు. నిజం చెప్తున్నాం. మేం ఎయిర్ టెల్ కంపెనీ వాళ్లం’ అని చెప్పినా నమ్మలేదు. ‘సరే.. ఓకే’ అని చెప్పి పెట్టేశా. మా ఫ్రెండ్స్​ని అడిగితే ‘లేదు మేం చేయలేదు. అది నిజంగా వాళ్లే చేశారు’ అని చెప్పడంతో షాక్​ అయ్యా. తర్వాత రియలైజ్​ అయ్యా. కానీ, జుట్టు కట్ చేసుకోవాలంటే కాస్త ఆలోచించా. అప్పుడు చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నన్ను మోటివేట్ చేశారు. ఫైనల్​గా నేను ఆ యాడ్ చేశా. దానివల్ల దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది” అంది సాషా.