- ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి
- ఏఐఎస్టీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ వెంటనే పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేండ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీం ఇచ్చిన తీర్పుపై కేంద్రం వెంటనే స్పందించాలని సదానందం కోరారు. ఈ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టులో ‘స్పెషల్ లీవ్ పిటిషన్’ వేయాలన్నారు. టీచర్లు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, నేతలు పరమేశ్, సాబేర్ అలి, పున్న గణేష్, శ్రీశైలం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
