బెల్లంపల్లి, వెలుగు: సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం వల్లనే కొత్త బొగ్గు గనులు ప్రారంభం కావడం లేదని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. శనివారం రాత్రి బెల్లంపల్లి కాంటాచౌరస్తాలో జరిగిన సేవ్ సింగరేణి జాతలో ఆయన మాట్లాడారు. సింగరేణి లో మెడికల్ బోర్డును పునరుద్ధరించి 300 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ లో చేపట్టే సమ్మెను కార్మికులు సక్సెస్ చేయాలని పిలుపు నిచ్చారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని వాపోయారు.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. సింగరేణిలో రూ.50 వేల కోట్ల బకాయిలు పేరుకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సభకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ మల్లేశ్ అధ్యక్షత వహించగా, సీపీఐ రాష్ట్ర వర్గ సభ్యుడు శంకర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, అసిస్టెంట్ సెక్రటరీ తిరుపతి గౌడ్, సీనియర్ నాయకులు నర్సయ్య, వెంకటస్వామి,ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ వైవీ రావు, నాయకులు రాజమౌళి, కార్యకర్తలు పాల్గొన్నారు.
