కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలి..మంత్రి వివేక్ వెంకటస్వామికి ఏఐటీయూసీ లీడర్ల వినతి

కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలి..మంత్రి వివేక్ వెంకటస్వామికి ఏఐటీయూసీ లీడర్ల వినతి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికుల డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్లు వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ స్టేట్ ​ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్​ సెక్రటరీ కొరిమి రాజ్​కుమార్, సింగరేణి కాంట్రాక్ట్ ​వర్కర్స్​ యూనియన్​ జనరల్ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల కాంట్రాక్ట్​ వర్కర్స్​ యూనియన్ లీడర్లు హైదరాబాద్​లోని సచివాలయంలో గురువారం మంత్రి వివేక్ ను కలిసి మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు తగ్గకుండా ఇచ్చేలా చూడాలని మంత్రిని కోరారు. 

కార్మికులందరికీ ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలన్నారు. స్థానిక నిరుద్యోగులకు, నిర్వాసితులకు సింగరేణి ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎల్లా గౌడ్, కాంట్రాక్ట్​ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు అప్రోజ్ ఖాన్, ఎర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు కేడబ్ల్యూ క్రిస్టోఫర్, నాయకులు జెట్టి మల్లయ్య, ఖాతారాజు ప్రభాకర్ తదితరులున్నారు.