సిద్దిపేటలో కాల్పులు.. అసలు ఏకే 47 ఎట్ల కొట్టేసిండు?

సిద్దిపేటలో కాల్పులు.. అసలు ఏకే 47 ఎట్ల కొట్టేసిండు?

    వారం రోజుల పోలీస్ కస్టడీకి సదానందం

    విచారిస్తున్న సిద్దిపేట ఏసీపీ

సిద్దిపేట, వెలుగు: అక్కన్నపేట కాల్పుల నిందితుడు సదానందాన్ని వారం రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. సదానందాన్ని బుధవారం హుస్నాబాద్ కోర్టులో హాజరు పరిచారు. కాల్పుల ఘటనతో పాటు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై విచారిస్తామని కోరడంతో కోర్టు కస్టడీకి అనుమతించింది. కాల్పుల ఘటనపై అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటికి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. హుస్నాబాద్​లో గల్లంతైన ఆయుధాలు సదానందం వద్దనే ఉన్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఎఫ్​ఐఆర్​లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. 2016లో  సదానందానికి ఇంటి పక్కన ఉన్న గొట్టె కొమురవ్వతో అప్పు విషయంలో గొడవ జరిగింది. దీంతో విషయం హుస్నాబాద్ పోలీస్   స్టేషన్ కు చేరింది. ఆ సమయంలో కొందరు సదానందాన్ని తీవ్రంగా కొట్టడంతో తన వద్ద ఆయుధాలుంటే రక్షణగా ఉంటుందని భావించాడు.

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఎవరూ లేని సమయంలో ఏకే 47, కార్బన్ ఆయుధాలతోపాటు 25 బుల్లెట్ల మ్యాగజైన్ బ్యాగులో వేసుకుని వెళ్లిపోయాడు. ఈ నెల 5న కొమురవ్వతో   మళ్లీ గొడవ జరగడంతో ఎలాగైన వారి కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. చాలా రోజులుగా తన వద్ద ఉన్న ఆయుధాలను ఉపయోగించాలని ప్రయత్నించినా పని చేయలేదు. దీంతో ఆయుధ భాగాలను విడదీశాడు.  కొహెడ మండలం బస్వాపూర్​లో ఆయిల్​కొని సమీపంలోని గుట్టల్లో  ఆయుధ విడిభాగాలను శుభ్రం చేసి బాగు చేశాడు. కాల్పుల ఘటనకు ముందు సదానందం వేరు చేసిన విడిభాగాలను బిగించి ఇంటి ముందు ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఏకే 47 పని చేస్తుందని నిర్ధారించుకున్న తర్వాత గంగరాజు ఇంటికి వెళ్లి కాల్పులు జరిపాడు. అనంతరం ఏకే 47 సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు. ఆ రాత్రి బొడిగెపల్లి గ్రామ శివార్లో చింతచెట్టు కింద పడుకున్నాడు. 8న ఉదయం కొహెడ వెళ్లాడు. పోలీసులు అక్కడ అతడిని గుర్తించి అరెస్టు చేశారు.

బయటకు ఎట్ల పోయినయ్​

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రెండు ఆయుధాలు చోరీ చేసినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో  పేర్కొన్నా   అవి ఎలా బయటకు వెళ్లాయన్న విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆ సమయంలో  సెంట్రీ డ్యూటీలో ఎవరున్నారు,  సదానందంకు ఎవరైనా సహకరించారా అన్నది తెలియడం లేదు. ఈ విషయంపై సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన తర్వాత అన్ని విషయాలను    వివరిస్తామని తెలిపారు.