నేటి నుంచి అసెంబ్లీ .. ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్​ ఒవైసీ

నేటి నుంచి అసెంబ్లీ .. ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్​ ఒవైసీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సెషన్​ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. గవర్నర్​తమిళి సై ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు శుక్రవారం నోటిఫికేషన్​జారీ చేశారు. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం ఈ సెషన్ ​నిర్వహిస్తున్నారు. ప్రొటెం స్పీకర్​గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ఓవైసీని ఎంపిక చేశారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు రాజ్​భవన్​లో ఆయనతో గవర్నర్​తమిళి సై​ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్ష స్థానంలో ఉండి సమావేశాలు నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ సెషన్​కు దూరంగా ఉండనున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్​గా నియమించడంతో తాను ఆయన ముందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోనని గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​ప్రకటించారు.

స్పీకర్​ ఎన్నికకు నోటిఫికేషన్​

అసెంబ్లీ స్పీకర్​ఎన్నికకు సోమవారం ఉదయం నోటిఫికేషన్ ​జారీ చేయనున్నారు. ఆ రోజు అసెంబ్లీలో నామినేషన్​లు మినహా ఇతర ఏ యాక్టివిటీ ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇవ్వనున్నట్టు తెలిసింది. కాంగ్రెస్​ పార్టీ వికారాబాద్​ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ​కుమార్​కు స్పీకర్​ పదవి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారమే నామినేషన్​ దాఖలు చేయనున్నారు. మంగళవారం అమావాస్య కావడంతో ఆ రోజు మధ్యాహ్నమే స్పీకర్ ​ఎన్నిక ప్రక్రియ పూర్తయినా కొత్త స్పీకర్ ​బాధ్యతలు చేపట్టకపోవచ్చని తెలుస్తోంది. బుధవారం ఉదయం స్పీకర్​గా గడ్డం ప్రసాద్​ కుమార్​ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం రేవంత్​రెడ్డితో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆయనను తోడ్కొని స్పీకర్​స్థానం వద్దకు వెళ్తారు. ఆ వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. స్పీకర్​గా ఎన్నికైన గడ్డం ప్రసాద్​ కుమార్​ను సభ అభినందించిన అనంతరం మరుసటి రోజుకు సభను వాయిదా వేస్తారు. ఆ తర్వాత స్పీకర్​అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశముంది. గురువారం అసెంబ్లీ, కౌన్సిల్​ను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశ పెట్టి చర్చించిన అనంతరం సభను వాయిదా వేస్తారని తెలిసింది.

ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ సమీక్ష

అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం సీఎస్​శాంతికుమారి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, డీజీపీ రవి గుప్తా సమీక్షించారు. అసెంబ్లీ పరిసరాలను వివిధ శాఖల అధికారులు, పోలీస్​ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.