V6 News

'Akhanda 2' Effect: ఇకపై టికెట్ ధరల పెంపునకు నో ఛాన్స్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన!

'Akhanda 2' Effect: ఇకపై టికెట్ ధరల పెంపునకు నో ఛాన్స్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన!

నంద‌మూరి బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ సినిమా టికెట్ ధరల పెంపు,  ప్రీమియర్‌ షో వ్యవహారం తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి సినిమాలకూ టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ముందుకు వెళ్తామని తేల్చిచెప్పారు.

 పొరపాటు జరిగింది..

‘అఖండ 2’ విషయంలో టికెట్ ధ‌ర‌లు పెంచి పొరపాటు జరిగిందని మంత్రి పేర్కొన్నారు. తన ప్రమేయం లేకుండానే శాఖాధికారులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చారని ఆయన వివరణ ఇచ్చారు. గ్లోబల్ సమ్మిట్, పంచాయ‌తీ ఎల‌క్షన్ వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఈ విష‌యం త‌న దృష్టికి రాలేదని, అందువల్లనే అధికారులు పొరపాటున అనుమతి ఇచ్చారని మంత్రి తెలిపారు. 

 వందల కోట్ల రెమ్యునరేషన్‌ ఎందుకు?

నిర్మాతలు, హీరోల రెమ్యునరేషన్ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తీవ్రంగా స్పందించారు . హీరోలకు అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు? టికెట్ ధరలు పెంచమని ఎవరూ మమ్మల్ని అడగకండి అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఇప్పటికే పెరిగిన ధ‌ర‌ల‌తో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు థియేట‌ర్‌కి రావట్లేదు. మధ్యతరగతి వాళ్లు సినిమా చూడాలంటే టికెట్ల రేట్లు తగ్గాలి అని డిమాండ్ చేశారు.  

ఈ కోర్టు నిర్ణయాలను ప్రస్తావించిన మంత్రి.. గతంలో హైకోర్టు కొంత మేరకు పెంచుకోవచ్చని వెసులుబాటు ఇచ్చింది. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే, ఇకపై పేదలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ఇది పేదల ప్రభుత్వం, మాది ఇందిరమ్మ ప్రభుత్వం. భవిష్యత్తులో సినిమా రేట్లు పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

 హైకోర్టులో పోరాటం

కాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులపై హైకోర్టులోనూ న్యాయ పోరాటం జరుతున్న విషయం తెలిసిందే.  టికెట్ ధరలను పెంచకూడదని, ప్రీమియర్‌లను రద్దు చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లింది మూవీ టీమ్. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్..   సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఈ నెల 14వ తేదీ వరకూ తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణ 15న వాయిదా వేసింది హైకోర్టు. దీంతో టికెట్ల రేట్ల పెంపు కొనసాగుతోంది.