V6 News

Akhanda 2: విడుదల వేళ.. శ్రీశైల మల్లన్నకి ప్రత్యేక పూజలు చేసిన అఖండ 2 టీమ్

Akhanda 2: విడుదల వేళ.. శ్రీశైల మల్లన్నకి ప్రత్యేక పూజలు చేసిన అఖండ 2 టీమ్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' చిత్రం చుట్టూ నెలకొన్న అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో, చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఆర్థిక వివాదాలు, కోర్టు స్టేల వంటి పలు విఘ్నాలను దాటుకొని, ఈరోజు (డిసెంబర్ 11) రాత్రి ప్రీమియర్ షోలతో సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఈ తరుణంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మహాక్షేత్రాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. చిత్ర యూనిట్ స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించింది.

Also read:- అఖండ 2' ప్రీమియర్ షో జీవో సస్పెన్షన్.. 

అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ షేర్ చేసింది. వీడియోలో హీరోలు ఆది సాయి కుమార్, అశ్విన్ బాబు లతో పాటుగా సింగర్ శ్రీకృష్ణ, లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విడుదల అవుతున్న అఖండ 2 గొప్ప విజయం సాధించాలని నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ.. 'అఖండ 2' సినిమా విడుదల చుట్టూ ఉన్న అన్ని విఘ్నాలు తొలగిపోవడంతోనే స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఈరోజు రాత్రి ( గురువారం ) ప్రీమియర్‌ షోతో 'అఖండ 2' ప్రజల ముందుకు రాబోతోందని చెప్పారు. మంచి సినిమా తీశాను. బాలయ్య అభిమానులు సహా ప్రేక్షకులందరూ సినిమాను చూసి ఎంజాయ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రికార్డులు దైవేచ్చ...

సినిమా రికార్డుల గురించి ప్రస్తావిస్తూ..  "రికార్డులు రావడం దైవేచ్చ. మనము మంచి సినిమాను ప్రజల ముందుకు తీసుకొచ్చాము, ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను అని బోయపాటి అన్నారు. మొదట డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక, న్యాయపరమైన సమస్యల కారణంగా వారం రోజులు ఆలస్యమైంది. చివరకు అన్ని సమస్యలను పరిష్కరించుకుని, ఈరోజు రాత్రి ప్రీమియర్ షోలతో మొదలై, రేపు (డిసెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'అఖండ 2' తాండవం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.