నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2: తాండవం' చిత్రానికి మళ్లి షాక్ తగిలింది. థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవుతున్న మరి కొన్ని గంటల ముందు మరోసారి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అనేక ఆర్థికపరమైన అడ్డంకులను దాటుకుని, డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో నిర్మాతలకు చుక్కెదురైంది.
నిజానికి, అంతకుముందు డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థిక వివాదం కారణంగా వారం రోజులు ఆలస్యమైంది. అన్ని సమస్యలను పరిష్కరించుకుని, రేపు (డిసెంబర్ 12) విడుదల ఖరారు చేసుకున్న సమయంలో, ప్రీమియర్లు నిర్వహణకు మరికొద్ది గంటల సమయం ఉండగా, ఈ కొత్త చిక్కు వచ్చి పడింది.
టికెట్ ధరల పెంపుపై పిటిషన్ దాఖలు
తెలంగాణ ప్రభుత్వం 'అఖండ 2' సినిమా కోసం ప్రత్యేక ప్రదర్శనలు (ప్రీమియర్ షోలు) నిర్వహించడానికి, అలాగే సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవో (GO)ను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి ద్వారా సతీష్ కమల్ అనే పిటిషనర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సాధారణంగా భారీ చిత్రాల విషయంలో అదనపు వసూళ్ల కోసం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపును కోరుతుంటారు. అయితే, ఈ పద్ధతి సాధారణ ప్రేక్షకులకు భారమని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు, 'అఖండ 2' నిర్మాతల అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రీమియర్ షో నిర్వహణ, రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. అంటే, ఈ రోజు (డిసెంబర్ 11) నిర్వహించాల్సిన ప్రీమియర్ షోలు, పెంచిన టికెట్ ధరలు చెల్లవు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది బాలయ్య అభిమానులకు, చిత్ర నిర్మాణ సంస్థకు తీవ్ర నిరాశ కలిగించింది.
Also read:- శ్రీశైల మల్లన్నకి ప్రత్యేక పూజలు చేసిన అఖండ 2 టీమ్
ఈ తీర్పు నేపథ్యంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు సినీ నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి (డిసెంబర్ 12) వాయిదా వేసింది. రేపటి కోర్టు తీర్పును బట్టే రేపటి రెగ్యులర్ షోల టికెట్ ధరలు, ఇతర నిబంధనలు ఎలా ఉంటాయో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామంతో అఖండ 2 విడుదల చుట్టూ మళ్లీ అనిశ్చితి వాతావరణం నెలకొంది.

