V6 News

సీఎం రేవంత్తో అఖిలేశ్ యాదవ్ భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ

సీఎం రేవంత్తో అఖిలేశ్ యాదవ్ భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ
  • రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను వివరించిన సీఎం 
  • సదర్కు రాష్ట్ర పండుగ గుర్తింపు ఇచ్చినందుకు రేవంత్​కు థ్యాంక్స్  
  • అంతకుముందు యాదవ ఆత్మీయ సమ్మేళనానికి హాజరు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని దేశవ్యాప్తంగా యాదవ సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను అఖిలేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సదర్ పండుగను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ నిర్ణయంతో యాదవుల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రశంసించారు. రాష్ట్రంలో యాదవ సమాజానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ భేటీలో ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా అఖిలేశ్ కు రేవంత్ వివరించారు. అంతకుముందు ఆదర్శనగర్ లో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. యాదవులు పార్టీలకతీతంగా ఒక్కతాటిపై ఉండాలన్నారు. పార్టీలు వేరైనా, ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు సాగాలన్నారు.  యాదవులందరిపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయన్నారు.

యూపీలో సమాజ్‌ వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అక్కడ బీజేపీని క్రమంగా వెనక్కి నెట్టేస్తున్నామని చెప్పారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ అందించిన సహకారమే కీలకమైందని, లేకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదే కాదన్నారు. తనకు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.