ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • స్టూడెంట్ల సామర్థ్యం కోసం శ్రీకారం చుట్టిన ఐటీడీఏ పీవో
  •  విద్యార్థులకు స్పెషల్​ గ్రేడింగ్ లు
  • వంద శాతం అమలు చేయాలి: వరుణ్ రెడ్డి 

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్​వెల్ఫేర్​స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు పీవో వరుణ్ రెడ్డి చర్యలు ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో  సోమవారం ఉట్నూర్​ కేబీ కాంప్లెక్స్​లో ‘అక్షర జ్యోతి’ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ పాఠశాలలో పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలపెంపునకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషిచేయాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి ఏబీసీడీ కేటగిరీలుగా విభజించాలన్నారు. అందరికీ చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్​సబ్జెక్టులను సులువుగా అర్థం చేసుకునే విధంగా విద్యాబోధన జరగాలన్నారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు స్పెషల్​ఎగ్జామ్స్​రాయించాలన్నారు. మొదటి విడతగాసెప్టెంబర్ లో, రెండో విడతగా డిసెంబర్​లో పరీక్షలు నిర్వహించాలన్నారు. మార్చి, ఏప్రిల్ లో నిర్వహించే పరీక్షల్లో ప్రతీ విద్యార్థి మార్కులు, గ్రేడ్ ఆధారంగా ఎ, బి క్యాటగిరీల్లో ఉండేలా కృషి చేయాలన్నారు. ఇప్పటికే 25 మార్కులతో ప్రశ్నా పత్రాలు ప్రింట్​చేశామని, టీచర్లకు డ్యూటీలూ కేటాయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని వందశాతం అమలయ్యేలా హెచ్ఎంలు  కృషిచేయాలన్నారు. విద్యార్థులలో సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు పెంచాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల డీటీడబ్ల్యూవోలు శ్రీనివాస్ రెడ్డి, మనెమ్మ, నీలిమా, ఏటీడబ్ల్యూవోలు సౌజన్య, నిహారిక పాల్గొన్నారు.

టెక్నాలజీకి అనుగుణంగా విద్యాబోధన

నిర్మల్,వెలుగు: రోజురోజుకు విస్తరిస్తున్న టెక్నాలజీకి అనుగుణంగానే విద్యాబోధన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక సోమవార్​పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆట్నివిటీ సొల్యూషన్స్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేమ్ ల్యాబ్​ను మంత్రి ప్రారంభించారు. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్​, రోబోటిక్స్​సైన్స్​కు సంబంధించిన అంశాలు నేర్చుకునే అవకాశం ఉందన్నారు. ఇంజినీరింగ్ విద్యలో విస్తరిస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకుంటూ విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకోసం స్టేమ్​ల్యాబ్​తోడ్పడుతుందన్నారు. విద్యార్థులు కొత్త పరిశోధనల వైపు దృష్టి సారించాలన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్లు రాంబాబు,హేమంత్​బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఈవో రవీందర్​ రెడ్డి, యాక్టివిటీ సొల్యూషన్ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ సుబ్రహ్మణ్యశర్మ, సెక్రెటరీ నీశా జ్యోషి, హెచ్ఎం మోహియోద్దీన్, జిల్లా సైన్స్ ఆఫీసర్ వినోద్​కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నిర్మల్ లో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కోసం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రజక సంఘం లీడర్లు పాల్గొన్నారు.

గిరిజన రిజర్వేషన్ పేరిట మరో మోసం

నిర్మల్,వెలుగు: గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ ప్రకటించిన సీఎం కేసీఆర్ మరో మోసానికి తెరలేపారని, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకే ఈ నాటకమని బీజేపీ పెద్దపల్లి ఇన్​చార్జి రావుల రాంనాథ్​ ఆరోపించారు. సోమవారం నిర్మల్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆదివాసీ మహిళ ద్రౌపదిముర్ము మద్దతు తెలపని కేసీఆర్​ఇప్పుడు గిరిజనుల రిజర్వేషన్లు అనడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ మాయమాటలు దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నమ్మడం లేదన్నారు. కొద్ది రోజుల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.

త్వరలో ప్రజా గోస, బీజేపీ భరోసా యాత్ర

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ నియోజకవర్గంలో అతిత్వరలో ప్రజాగోస, బీజేపీ భరోసా తిరిగి చేపట్టనున్నట్లు బీజేపీ ఖానాపూర్ అసెంబ్లీ నాయకుడు అజ్మీరా హరినాయక్  చెప్పారు. సోమవారం స్థానిక ఐబీ గెస్ట్ హౌజ్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి  ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వస్తారన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆధ్వర్యంలో ప్రజా గోస, బీజేపీ భరోసా యాత్ర సాగుతుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాజశేఖర్, మండల అధ్యక్ష, కార్యదర్శులు టేకు ప్రకాశ్, పల్లె అశోక్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సందు పట్ల శ్రావణ్, లీడర్లు పెడ్డి రమేశ్, దాసరి రాజేశ్వర్, ప్రవీణ్, రాజేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సిలిండర్​ ప్రమాదాలు జరగకుండా చూడాలి

రామకృష్ణాపూర్​,వెలుగు: వంట గ్యాస్​ వినియోగం సందర్భంగా ప్రమాదాలు జరుగకుండా అలర్ట్​గా ఉండాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ సూచించారు. సోమవారం రామకృష్ణాపూర్​లోని సింగరేణి సూపర్​బజార్​ఆవరణలో ఇండేన్​గ్యాస్​ వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జీఎం చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. సింగరేణి సూపర్​ బజార్ల ద్వారా కార్మిక కుటుంబాలకు వంటగ్యాస్ సరఫరా అవుతోందన్నారు. ఐరన్ గ్యాస్​ సిలిండర్లకు బదులు ప్రమాదాలు జరగకుండా ప్లాస్టిక్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ అయిల్​ కార్పొరేషన్ సేఫ్టీ ఆఫీసర్ విన్ను, సేల్స్ ఆఫీసర్ మహేశ్​వినియోగదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మందమర్రి ఏరియా డీవైపీఎం శ్యాంసుందర్, సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్, డీవైపీఎం సుదర్శన్, ఏఐటీయూసీ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, టీబీజీకేఎస్ లీడర్​ డి.శంకర్​రావు, ఆర్కేపీ సూపర్​బజార్ బ్రాంచి మేనేజర్ సుదర్శన్, ప్రసాద్, రవి పాల్గొన్నారు. 

అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గా పడాల రాజశేఖర్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గా  పట్టణానికి చెందిన పడాల రాజశేఖర్  నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ కన్వీనర్ గా సంతోష్

బెల్లంపల్లి,వెలుగు: నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గా రాచర్ల సంతోష్, జాయింట్ కన్వీనర్ గా రాజులాల్ యాదవ్  నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

డాక్టర్​ రమణకు ప్రెసిడెంట్​షిప్​ అవార్డు  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలకు చెందిన ప్రముఖ ఈఎన్​టీ డాక్టర్​ రమణకు ప్రెసిడెంట్​షిప్​ ఆఫ్​ ఏఓఐ ఫర్​ తెలంగాణ– 2022–23 అవార్డు లభించింది. చెవి, ముక్కు, గొంతు డాక్టర్ల అసోసియేషన్​ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్​ 7వ ఈఎన్​టీ కాన్ఫరెన్స్​ ఈ నెల 16 నుంచి 18 వరకు కరీంనగర్​లోని ప్రతిమ హాస్పిటల్​లో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్​ రమణ ప్రెసిడెంట్​షిప్​ అవార్డు అందుకున్నారు.   

విద్యుత్​ సమస్యలు పరిష్కరించాలి 

మంచిర్యాల, వెలుగు: విద్యుత్​ సమస్యలు పరిష్కరించాలని పలువురు ప్రజాప్రతినిధులు, వినియోగదారులు అధికారులను కోరారు. సోమవారం మంచిర్యాలలోని ఎస్​ఈ ఆఫీస్​లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఐపీసీ, ఆర్​ఏసీ డైరెక్టర్​ పి.గణపతి, ఆపరేషన్స్​ డైరెక్టర్​ పి.మోహన్​రెడ్డి, ఎస్​ఈ శేషారావు పాల్గొన్నారు. అన్ని ఏరియాలలో లో వోల్టేజీ సమస్యలను పరిష్కరించాలని, బెండింగ్ పోల్స్ మార్చాలని, లూజ్ లైన్లను సరిచేయాలని, తుప్పు పట్టిన ఇనుప పోల్స్​ను మార్చాలని మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్​ వేములపల్లి సంజీవ్​ కోరారు. అధికారులు స్పందిస్తూ రెండు 160 కేవీ ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేసి లోవోల్టేజీ సమస్య తీరుస్తామని, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 

సమస్యలు త్వరగా పరిష్కరించాలి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆఫీసర్లు ప్రజాసమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్లు, అడిషనల్​కలెక్టర్లు, ఐటీడీఏ పీక్ష కోరారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టరేట్లు, ఉట్నూర్​ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్​సెల్​కు వారు హాజరై బాధితుల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఆదిలాబాద్​లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా, ట్రెయినీ కలెక్టర్​ పి.శ్రీజ, ఆర్డీవో రమేశ్​రాథోడ్, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్​డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్​లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్​ రాహుల్​రాజ్, ఉట్నూర్​ఐటీడీఏలో పీవో వరుణ్ రెడ్డి అర్జీలు తీసుకున్నారు  కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ దిలీప్, ఓఎస్డీ కృష్ణయ్య, పీవీటీజీ ఆత్రం భాస్కర్, జేడీఎం నాగభూషణ్, బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, ఏవో రాంబాబు, ఉద్యానవన శాఖ అధికారి సుధీర్, డీపీవో ప్రవీణ్ పాల్గొన్నారు.

ఓట్లు దండుకునేందుకే రిజర్వేషన్ల డ్రామా

ఆసిఫాబాద్,వెలుగు: ఓట్లు దండుకునేందుకే సీఎం కేసీఆర్​ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అంటూ డ్రామా ఆడుతున్నారని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక్​విజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. నిరసనలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మడావి వెంకటేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి, ఆసిఫాబాద్ తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కోవ విజయ్, లీడర్లు పెందోర్ ధర్ము, వెడ్మ భగవంత్ రావు, గేడం సుభాష్, కొట్నాక రాంశావు, కనక ప్రకాశ్, ఉయిక రాము తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం 

జైనూర్,వెలుగు: డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాటం ఆపేదిలేదని తుడుం దెబ్బ స్టేట్ కమిటీ మెంబర్ కొడప నాగేశ్,​ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కా బాపూరావు స్పష్టం చేశారు. సోమవారం జరిగిన పాదయాత్రలో వారు మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్​చేశారు. ఈ నెల 21 న జోడేఘాట్​లో భవిష్యత్​కార్యాచరణ 
రూపొందిస్తామన్నారు.

బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి 

మంచిర్యాల, వెలుగు: విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం సత్యనారాయణ, కుంచాల శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేసి ఏవో సురేష్​కు మెమోరాండం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని ఆరోపించారు. బీసీల కుల గణన చేయాలని, దళితబంధు లాగా బీసీబంధు అమలు చేయాలని, నాలుగేండ్లుగా పెండింగ్​లో బీసీ కార్పొరేషన్ లోన్లు శాంక్షన్​ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు మెరుగు రాజేశం, రవీందర్​,   పూదరి మల్లేష్, కొండు బానేష్, మేకల రాజేశం, బియ్యాల రాజేశం, కట్ల రమేష్, ఆర్. వెంకన్న పాల్గొన్నారు.  

అసిస్టెంట్ ​మేనేజర్​పై చర్యలు తీసుకోవాలి

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ ఆర్టీసీ ఉదోగ్యులను వేధిస్తున్న డిపో అసిస్టెంట్ మేనేజర్( సీఐ) విశ్వనాథ్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం ఉద్యోగులు, బీజేపీ లీడర్లు కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు.  మహిళా కండక్టర్లు నైట్ 8 గంటల్లోపే డ్యూటీదిగి ఇంటికి వెళ్లాలని రూల్​ ఉన్నా.. అదేమీ పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు సిక్ లీవ్ పెట్టినా ఆబ్​సెంట్​ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు విశాల్, కార్మికులు దివాకర్, నరేశ్, ఏజాజ్, శ్రీనివాస్, సమ్మయ్య, అశోక్ ,సిద్దీఖ్ , రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జోగు రామన్నకు మాతృవియోగం

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తల్లి భోజమ్మ (98)  సోమవారం స్వగ్రామం జైనథ్ మండలంలోని దీపాయిగూడ లో కన్నుమూసింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేను పరామర్శించారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ చైర్మెన్ రాథోడ్​జనార్దన్, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామారావు పటేల్, సాజిద్ ఖాన్ హాజరయ్యారు.