
ఫైట్ మాస్టర్ల కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 650 మందికి పైగా స్టంట్ మాస్టర్లకు హెల్త్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయాలను కల్పించారు. స్టంట్ మ్యాన్‌కు ఏదైనా ప్రమాదం జరిగినా, లేదా అనారోగ్యానికి గురైనా ఈ ఇన్సురెన్స్ ద్వారా రూ.5.5 లక్షల విలువైన చికిత్స ఉచితంగా అందుతుంది. అలాగే ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.20–25 లక్షల వరకు భీమా కల్పించారు.
ఇటీవల రాజు అనే కోలీవుడ్ స్టంట్ మాస్టర్ ప్రమాదవశాత్తు మరణించాడు. ఆర్య హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వేట్టువం’ షూటింగ్‌లో భాగంగా కారుతో స్టంట్స్ చేస్తుండగా.. ఆ కారు పల్టీలు కొట్టడంతో రాజు చనిపోయాడు. తన కెరీర్‌లో ఎన్నో రిస్కీ స్టంట్స్ చేసిన అక్షయ్ కుమార్.. ఈ ఘటనతో చలించిపోయి తన గొప్ప మనసును చాటుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్షయ్ చేసిన పనికి ఫైట్ మాస్టర్స్ యూనియన్స్ సర్వత్రా హర్షం వ్యక్తం చేశాయి. సినీ ఇండస్ట్రీ అంతా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పింది. ఇదిలా ఉంటే.. అక్షయ్ కుమార్ నటించిన ‘హౌస్‌ఫుల్ 5’ జూన్ 5న థియేటర్లలో రాగా, తాజాగా ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వలెన్ ఫెర్నాండైజ్ కీలక పాత్రలు పోషించారు.