కుల గణన నిర్ణయం..సామాజిక తెలంగాణకు ముందడుగు

కుల గణన నిర్ణయం..సామాజిక తెలంగాణకు ముందడుగు

 

  •     రౌండ్ టేబుల్  మీటింగ్ లో వక్తల వ్యాఖ్య
  •     కుల గణన జరగకుండా కేంద్రం కుట్ర   : జస్టిస్ చంద్రకుమార్
  •     గత సర్కార్ సర్వే వివరాలు బయటపెట్టాలి : ఆకునూరి మురళి

ఖైరతాబాద్, వెలుగు: కుల గణనపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పలువురు వక్తలు అన్నారు. కుల గణనపై అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమలు దిశగా తీసుకెళ్లడం సంతోషకరమన్నారు. సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడుతున్నాయని తెలిపారు. ప్రజా తెలంగాణ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ‘కుల గణనపై కార్యాచరణ’ అనే అంశంపై ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. కుల గణనపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో విప్లవాత్మకమైందని అన్నారు. ఎన్నో ఏండ్లుగా రాజ్యాధికారం మొత్తం రెండు సామాజిక వర్గాల చేతుల్లో ఉండిపోయిందని తెలిపారు. ‘‘సకల జనుల పేరుతో గత సర్కార్ సర్వే చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఏమయ్యాయో ఇప్పటికీ తెలియదు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. కులగణన జరగకుండా కుట్ర చేస్తున్నది. దేశవ్యాప్తంగా 7.50 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 14.5 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో, న్యాయ్ యాత్రలో కుల గణన అవసరమని చెప్పారు’’ అని తెలిపారు. 

కుల గణనకు స్టాఫ్ పెంచి.. కమిటీ వేయాలి

మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడారు. కుల గణనపై బిహార్ సర్కార్ 17 అంశాలపై అధ్యయనం చేయగా.. తెలంగాణ ప్రభుత్వం 40 అంశాలపై అధ్యయనం చేయనుందన్నారు. దీని కోసం కమిటీ వేయాలని కోరారు. ‘‘కుల గణనకు సంబంధించి స్టాఫ్​ను పెంచాలి. గత ప్రభుత్వం చేసిన సర్వే వివరాలను బయటపెట్టాలి. సమగ్ర కుల గణనతో సామాజిక, విద్య, సాంస్కృతిక, ఉద్యోగ, వృత్తి, రాజకీయ సంబంధపరమైన సమాచారం అందరికీ లభిస్తుంది’’అని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ సింహాద్రి మాట్లాడారు. 

సామాజిక తెలంగాణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చైతన్యవంతులు అవుతారని భావించి కుల గణనకు అడ్డుపడిందన్నారు. బీసీ కుల గణన అంటే.. బీసీలను విభజించడమే అని తెలిపారు. ప్రొఫెసర్ తిరుమల్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోనే జస్టిస్ ఉందని అంటే.. అక్కడే న్యాయం ఉందన్నారు. ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు, జమ్మయ్య, జానయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. కుల గణన అమలు దిశగా చర్యలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముర్రా వెంకటేశంకు ధన్యవాదాలు చెప్పారు.