
హైదరాబాద్: బనకచర్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్ట్ అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. గురువారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బనకచర్లపై చర్చకు వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి చివరి నిమిషంలో భేటీకి వెళ్లారని విమర్శించారు.
కేంద్ర జలశక్తి శాఖ అధ్యక్షతన బుధవారం (జూలై 16) ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల. కానీ సమావేశంలో బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ALSO READ : ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే.. BRS నేతలు ఎప్పటికైనా నా దారికి రావాల్సిందే: కవిత
సీఎం రేవంత్ మెగా కంపెనీ వాటా కోసమే ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి సమావేశానికి హాజరయ్యాడన్నారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. వర్షకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.