హెచ్‌‌సీఏ అవినీతిలో కేటీఆర్, కవిత పాత్ర : గురువా రెడ్డి

హెచ్‌‌సీఏ అవినీతిలో కేటీఆర్, కవిత పాత్ర : గురువా రెడ్డి
  • దీనిపై బీసీసీఐ, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి
  • టీసీఏ జనరల్ సెక్రటరీ గురువా రెడ్డి ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ)లో  అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) జనరల్ సెక్రటరీ గురువా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌‌సీఏ అవినీతిలో బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కేటీఆర్, హెచ్‌‌సీఏ అకాడమీ ఆఫ్ ఎక్స్‌‌లెన్స్ మాజీ డైరెక్టర్ వాంకా ప్రతాప్ పాత్ర ఉందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కవిత, కేటీఆర్ తెరవెనుక నుంచి హెచ్‌‌సీఏ కార్యకలాపాలను ప్రభావితం చేశారని వెల్లడించారు. 

ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కాంట్రాక్ట్, మ్యాచ్‌‌ల సందర్భంగా ఫుడ్, ట్రావెల్స్ కాంట్రాక్ట్‌‌లను వారి బంధువులకు చెందిన కంపెనీలకు అక్రమంగా కేటాయించారని ఆరోపించారు. హెచ్‌‌సీఏ అకాడమీ డైరెక్టర్‌‌గా వాంకా ప్రతాప్.. టీమ్ సెలెక్షన్లలో అవినీతిని ప్రోత్సహించి, సెలెక్షన్లను తారుమారు చేశారని, ఈ విషయంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయని గురువా రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా హెచ్‌‌సీఏలో  అవినీతిపై బీసీసీఐ, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. 

పదేండ్లలో  రూ.600 కోట్లు దుర్వినియోగం 

గడిచిన పదేండ్లలో హెచ్‌‌సీఏలో రూ.500- నుంచి 600  కోట్లదాకా బీసీసీఐ నిధులు దుర్వినియోగమయ్యాయని గురువారెడ్డి అన్నారు. అవినీతి, ఆర్థిక అక్రమాలు, క్రికెటర్ల ఎంపికల్లో అవకతవకలతో హెచ్‌‌సీఏలో సంక్షోభం నెలకొందని తెలిపారు. ఇది రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి, యువ క్రికెటర్ల కెరీర్‌‌కు ఆటంకం కలిగించిందన్నారు. ఐపీఎల్ టిక్కెట్ల బ్లాక్ మార్కెట్, సెలెక్షన్లలోనే భారీ అవినీతి జరిగిందని..ప్రస్తుతం హెచ్‌‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌‌  ప్రెసిడెంట్, ట్రెజరర్ కస్టడీలో, సెక్రటరీ పరారీలో ఉన్నారని, ఇతర సభ్యులపైనా కేసులు నడుస్తున్నాయని వివరించారు. అవినీతిపై సీఐడీకి మరిన్ని ఆధారాలు సమర్పించామని..జగన్ మోహన్ రావు సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై క్రిమినల్ చర్యలు కోరినట్టు గురువారెడ్డి పేర్కొన్నారు.