రాష్ట్రంలో నాగార్జున లాంటి సినిమా హీరోలకే రైతుబంధు అందుతుంది కానీ.. రైతులకు అందడం లేదని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు. సీఎం కేసీఆర్ దృష్టిలో కౌలు రైతులు..అసలు రైతులే కాదని అన్నారు. దున్నే కౌలు రైతుకు రైతు బంధు ఇవ్వకుండా.. దొరలకు.. ధనవంతులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం 14 అంశాలతో కూడిన బుక్ లేట్ ను రూపొందించామని, ఈ బుక్ లేట్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని ఆకునూరి మురళి చెప్పారు. పంట భీమా లేని ఏకైక రాష్ట్రం.. తెలంగాణ అని ఆకునూరి మురళి మండిపడ్డారు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను అయినా రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. దళారీ చేతిలో రైతులు మోస పోకుండా ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఇప్పటివరకు 7 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆకునూరి మురళీ ఆరోపించారు. 45 లక్షల సాగు భూమికి 3.2 లక్షల టన్నుల విత్తనాలు అవసరం ఉంటాయిని పేర్కొన్నారు. లక్షల మంది రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించి ప్రభుత్వం ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని సూచించారు.
రైతుల వ్యవహారాలకు సంబంధించిన రాజ్యాంగ బద్ధ సంస్థ లాంటి ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆకునూరి మురళి సూచించారు. రాష్ట్రంలో సహకార సంఘాలు.. మార్కెట్ కమిటీలు బలోపేతం కావాలి కానీ రాజకీయ నాయకులు వారి లబ్ది కోసమే వీటిని వాడటం మానుకోవాలని పేర్కొన్నారు. రైతు పండించిన పంటను కనీసం స్టోరేజ్ చేసుకోవడం కోసం గిడ్డంగులు.. గోదాములు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో 124 ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ లు ఉన్నాయని.. ప్రభుత్వమే 1000 కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరుగుతుందని ఆకునూరి మురళీ అభిప్రాయపడ్డారు.