కేసీఆర్ రాజకీయాలను వ్యాపారంగా మార్చాడు..కొత్త పార్టీ అవసరం:ఆకునూరి మురళి 

కేసీఆర్ రాజకీయాలను వ్యాపారంగా మార్చాడు..కొత్త పార్టీ అవసరం:ఆకునూరి మురళి 
  • అవసరమైతే కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది : రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి 

మంచిర్యాల, వెలుగు : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని రిటైర్డ్ ఐఏఎస్, ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వక ట్రస్ట్ హాల్​లో ‘సామాజిక తెలంగాణ ప్రత్యామ్నాయ రాజకీయాలు’ అన్న అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాల పోరాటాలతో భౌగోళిక తెలంగాణ వచ్చింది గాని.. సామాజిక తెలంగాణ రాలేదన్నారు. ఆ తెలంగాణ సాధించుకున్నప్పుడే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ రాజకీయాలను వ్యాపారంగా మార్చాడని, వేల కోట్ల అవినీతికి తెరలేపాడని విమర్శించారు. కేసీఆర్ దుర్మార్గపు పరిపాలన వల్ల 50 లక్షల మంది రైతులు, 20 లక్షల మంది కౌలు రైతులు, 40 లక్షల మంది రైతు కూలీలు, ఉపాధి కూలీలు, 30 లక్షల మంది నిరుద్యోగులు, 35 లక్షల మంది విద్యార్థులు, 20 లక్షల మంది ఇండ్లు లేని పేదలు అరిగోస పడుతున్నారన్నారు. తెలంగాణలో కావాల్సినంత సంపద ఉన్నా మంచి విద్యాసంస్థలు, హాస్పిటల్స్ లేవన్నారు.

వందల కోట్లు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలనే పరిస్థితిని కల్పించాడని ఆరోపించారు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. అవసరమనుకుంటే సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రెంట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళి మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ తుంగలో తొక్కాడని విమర్శించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వరరావు, ఎస్టీఎఫ్ కో కన్వీనర్లు డాక్టర్ రమ, పృథ్వీరాజ్, ఆర్ఎంపీల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, బీసీ ఫ్రంట్ సెక్రెటరీ దేవల్ల సమ్మయ్య, వెంకట్ రెడ్డి, ఇబ్రహీం, స్వప్న గౌడ్ పాల్గొన్నారు