హైదరాబాద్లో అల్- ఫలాహ్ వర్సిటీ చైర్మన్‌‌‌‌ సోదరుడు అరెస్ట్‌‌‌‌

హైదరాబాద్లో అల్- ఫలాహ్ వర్సిటీ చైర్మన్‌‌‌‌ సోదరుడు అరెస్ట్‌‌‌‌
  • హైదరాబాద్​లో అదుపులోకి తీసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు
  • చీటింగ్ కేసులో అరెస్టు.. ట్రాన్సిట్ వారెంట్ పై తరలింపు
  • ఫైనాన్స్ కంపెనీ పేరుతో డబ్బు సేకరించి పరార్
  • 25 ఏండ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఢిల్లీ కారు పేలుడుతో సంబంధాలు ఉన్న అల్- ఫలాహ్  యూనివర్సిటీ చైర్మన్‌‌‌‌  జావెద్  సిద్ధిఖీ సోదరుడు హమూద్‌‌‌‌  సిద్ధిఖీని మధ్యప్రదేశ్‌‌‌‌ పోలీసులు ఆదివారం హైదరాబాద్‌‌‌‌లో అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్  మహౌ పోలీస్ స్టేషన్‌‌‌‌లో  నమోదైన చీటింగ్‌‌‌‌  కేసులో అరెస్టు చేసి.. ట్రాన్సిట్ వారంట్‌‌‌‌పై ఎంపీకి తీసుకెళ్లారు. గత 25 ఏండ్లుగా సిద్దిఖీ తప్పించుకు తిరుగుతున్నాడు. 

మారువేషంలో హైదరాబాద్‌‌‌‌  కామాటిపురలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భాగంగా జావెద్  సిద్ధిఖీని విచారిస్తుండగా అతని సోదరుడు హమూద్‌‌‌‌పై నాన్‌‌‌‌ బెయిలబుల్‌‌‌‌ వారెంట్లు ఉన్నట్లు తేలింది. హమూద్  హైదరాబాద్‌‌‌‌లో ఉన్నట్లు గుర్తించి సిటీ పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. 

ఇండోర్  రూరల్‌‌‌‌ ఎస్పీ యోగ్చన్  భూటియా మీడియాకు వివరాలు వివరించారు. హమూద్  సిద్ధిఖీ, జావెద్  సిద్ధిఖీ 25 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్‌‌‌‌లోని మహౌలో  ఫైనాన్స్ కంపెనీ నిర్వహించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి ఉడాయించారు. 

ఈ కేసులో వీరిద్దరూ పరారీలో ఉన్నారు. హమూద్‌‌‌‌పై నాన్ బెయిలబుల్  వారంట్‌‌‌‌  కూడా జారీ అయింది. ఈ కేసుల్లో హమూద్‌‌‌‌ను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్‌‌‌‌  పోలీసులు చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. పోలీసుల గాలింపుతో హమూద్‌‌‌‌  అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 

కారు బ్లాస్టు కేసు దర్యాప్తులో బయటపెట్టిన జావెద్‌‌‌‌

ఢిల్లీ కార్‌‌‌‌‌‌‌‌ బ్లాస్ట్‌‌‌‌ తోపాటు చీటింగ్​ కేసులో జావెద్​ను విచారించగా తన సోదరుడు హమూద్‌‌‌‌కు సంబంధించిన సమాచారాన్ని అతను బయటపెట్టాడు.  హమూద్  హైదరాబాద్‌‌‌‌లో ఉన్నట్లు మధ్యప్రదేశ్‌‌‌‌  పోలీసులకు ఆధారాలు లభించాయి. మారువేషంలో నివసిస్తున్నాడని గుర్తించారు. మహౌ ఇంటెలిజెన్స్‌‌‌‌  పోలీసులు సమాచారాన్ని సేకరించారు. 

హైదరాబాద్‌‌‌‌కు వచ్చిన స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌  పోలీసులు హమూద్‌‌‌‌ను ట్రాక్  చేశారు. హైదరాబాద్‌‌‌‌  సిటీ పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. ప్రస్తుతం హమూద్‌‌‌‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఢిల్లీ కారు పేలుడు తర్వాత హమూద్‌‌‌‌  పట్టుబడడంతో హైదరాబాద్‌‌‌‌లో కలకలం రేగింది. హమూద్  అరెస్టుతో హైదరాబాద్‌‌‌‌  పోలీసులు అప్రమత్తం అయ్యారు. అతను ఎంతకాలం హైదరాబాద్‌‌‌‌లో ఉన్నాడనే వివరాలు సేకరిస్తున్నారు.