ఆత్మీయతను పంచిన అలయ్‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌.. రాజకీయాలకతీతంగా దత్తన్న దసరా పండుగ

ఆత్మీయతను పంచిన అలయ్‌‌‌‌‌‌‌‌ బలయ్‌‌‌‌‌‌‌‌.. రాజకీయాలకతీతంగా దత్తన్న దసరా పండుగ
  • ఒకే వేదికపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, సీపీఐ నేతలు 
  • నోరూరించే 110 రకాల వంటకాలతో పసందైన విందు 
  • డప్పు దరువులు, గుస్సాడి, కోలాటం.. తోలుబొమ్మలాటలు
  • 12 వేల మందికి ఘుమఘుమలాడే తెలంగాణ దావత్‌‌‌‌‌‌‌‌
  • అంబలి, బగార బువ్వ, యాట కూర నుంచి హలీమ్‌‌‌‌‌‌‌‌ దాకా..

హైదరాబాద్, వెలుగు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయ లక్ష్మి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో నిర్వహించిన దత్తన్న అలయ్ బలయ్ ఆత్మీయతను పంచింది. రాజకీయాల కతీతంగా అన్ని పార్టీల నేతలు ఒకే వేదిక పైకి వచ్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని  పండుగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, సీపీఐ నేతలతోపాటు పాటు పలు ప్రజాసంఘాల ప్రతినిధులు ఒకే వేదికపై చేతులు కలిపి కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ఒడిలో సేదతీరి, బగార బువ్వ నుంచి హలీమ్‌‌‌‌‌‌‌‌ దాకా ఘుమఘుమలాడే వంటకాలను ఆస్వాదించారు.

తెలంగాణ పల్లె జీవన వైభవాన్ని, విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కట్టేలా అలయ్ ​బలయ్​ ప్రాంగణంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. నెత్తిన బోనాలతో మహిళలు, డప్పు చప్పుళ్లు, లయబద్ధమైన కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రాచీన కళారూపమైన తోలుబొమ్మలాట, ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే గుస్సాడి నృత్యం, అలనాటి గుడ్డెలుగుల ఆటలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళాకారుల విన్యాసాలు, జానపద కళారూపాల సందడితో వేదిక ప్రాంగణమంతా తెలంగాణ పండుగ వాతావరణాన్ని తలపించింది. 

ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతినిధులు, ప్రజల కోసం అదిరిపోయే రీతిలో భారీ విందును ఏర్పాటు చేశారు. సుమారు 12 వేల మందికి సరిపడా ఏకంగా 110 రకాల అచ్చ తెలంగాణ సంప్రదాయ వంటకాలను వండించారు.

ఘుమఘుమలాడే మటన్, నాటుకోడి చికెన్, చేపల పులుసు, రొయ్యల వేపుడు, గుడ్ల ఇగురు మొదలుకొని పచ్చిపులుసు వరకు అన్నీ సిద్ధం చేశారు. వీటితో పాటు తెల్ల అన్నం, నోరూరించే బగార బువ్వ, ఘాటైన సాంబారు, దాల్చా, రకరకాల రోటి పచ్చళ్లను వడ్డించారు. తెలంగాణ ప్రత్యేక పిండివంటలైన సకినాలు, తీపి గవ్వలు, అప్పడాలతో పాటు హైదరాబాదీ స్పెషల్ హలీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా రుచి చూపించారు.