మందు తాగేటోళ్లలో జనగామ టాప్

మందు తాగేటోళ్లలో జనగామ టాప్
  • జిల్లాలో 60.6 శాతం మందికి మద్యం అలవాటు 
  • 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది వినియోగదారులు
  • ప్రతి వంద మందిలో ఏడుగురు మహిళలకు మద్యం అలవాటు 
  • పొగాకు వినియోగంలో ఆసిఫాబాద్ ఫస్ట్ 

హైదరాబాద్, వెలుగు: మందు ఎక్కువ మంది తాగుతున్న జిల్లాగా జనగామ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ జిల్లాలో ఏకంగా 60.6 శాతం మంది మద్యం తాగుతున్నట్లు ప్లానింగ్ డిపార్ట్‌‌మెంట్ విడుదల చేసిన రిపోర్టులో వెల్లడైంది. యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భువనగిరిలో 58.4 శాతం మంది, మహబూబాబాద్‌‌లో 56.5 శాతం మందికి తాగుడు అలవాటు ఉందని రిపోర్టు పేర్కొంది. రాష్ట్రంలో సగటున 43.3 శాతం మంది మద్యం తాగేటోళ్లు ఉండగా, 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది మద్యం తాగుతున్నట్లు వెల్లడించింది. అర్బన్ జిల్లా హైదరాబాద్‌‌లో మాత్రం 28 శాతం మందే ఆల్కహాల్ వినియోగదారులు ఉండడం విశేషం. వైన్ షాపుల సంఖ్య పెరగడం, 24 గంటలూ బెల్ట్‌‌ షాపులు అందుబాటులో ఉండడంతో ఊళ్లల్లో జనాలు తాగుడుకు అలవాటు పడుతున్నారని క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఆఫీసర్లు చెబుతున్నారు. మందు తాగే మహిళల సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలో సగటున ప్రతి 100 మందిలో ఏడుగురు మద్యం తాగుతుండగా... మెదక్‌‌లో అత్యధికంగా 23.8 శాతం మంది మహిళలకు మద్యం అలవాటు ఉంది. రాష్ట్రంలో 15 ఏండ్ల వయసు దాటినోళ్లపై సర్వే చేసి ఈ రిపోర్టు రూపొందించారు. 

22.3 శాతం మందికి పొగాకు అలవాటు.. 
మందు తాగుట్ల జనగామ టాప్‌‌లో ఉంటే, పొగాకు నమలడంలో ఆసిఫాబాద్‌‌ ఫస్ట్ ప్లేసులో ఉంది. ఈ జిల్లాలో 37.7 శాతం మందికి పొగాకు తినే అలవాటు ఉంది. రెండో స్థానంలో నాగర్‌‌‌‌కర్నూల్‌‌, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 22.3 శాతం మందికి పొగాకు తినే అలవాటు ఉన్నట్టు రిపోర్టులో వెల్లడైంది. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాల్లో 12.4 శాతం మంది పొగాకు తింటున్నారు. వరంగల్ అర్బన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ  ఈ అలవాటు తక్కువే ఉంది. రాష్ట్రంలో 6.7 శాతం మంది ఆడవాళ్లకు పొగాకు తినే అలవాటు ఉంటే, మెదక్ జిల్లాలో 23.8 శాతం మంది మహిళలకు పొగాకు అలవాటు ఉంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో నోటి క్యాన్సర్ కేసులూ ఎక్కువేనని  గతంలో ఓ సర్వే తేల్చింది.

మద్యంపై ఏడాదికి 7 వేల ఖర్చు.. 
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కంటే.. ఆల్కహాల్ కోసం జనాలు చేస్తున్న ఖర్చు ఎక్కువగా ఉంది. ఒక్కో వ్యక్తి ఆరోగ్యం కోసం ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.1,600  ఖర్చు చేస్తుండగా.. జనాలు ఆల్కహాల్ కొనేందుకు ఏడాదికి సగటున రూ.7,695 ఖర్చు చేస్తున్నారు. 2021-–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.30,783 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి ఈ మొత్తాన్ని పంచితే, ఒక్కొక్కరికీ రూ.7,695 వస్తాయి. మద్యం అలవాటు ఉన్న 43 శాతం మందికే పంచితే ఒక్కొక్కరికీ రూ.16 వేలకు పైనే వస్తాయి.