పదేళ్లకే మందు తాగుతున్నారు

పదేళ్లకే మందు తాగుతున్నారు

ఈమధ్య దేశవ్యాప్తంగా చేసిన ఓ సర్వేలో పంజాబ్‌‌ టాప్‌‌ ప్లేస్‌ లో నిలిచింది. కానీ అది గర్వపడే విషయంలో కాదు. ఎక్కువగా మందు తాగుతున్న చిన్నారుల్లో దేశంలో ముందుంది ఆ రాష్ట్రం . 10 నుంచి 17 ఏళ్లలోపు చిన్నారుల్లో 1.2 లక్షల మంది మందుకు అలవాటయ్యారంట అక్కడ. న్యూఢిల్లీలోని నేషనల్‌‌ డ్రగ్‌ డిపెండెన్స్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్‌ (ఎన్‌ డీడీటీసీ), ఎయిమ్స్‌‌ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘మ్యాగ్ని ట్యూడ్‌‌ ఆఫ్‌‌ సబ్‌‌స్టన్స్‌‌ యూజ్‌‌ ఇన్‌ ఇండియా’ పేరుతో విడుదలైన ఈ సర్వేలో జాతీయ సగటు (40 వేలు)కు మూడు రెట్లు ఎక్కువ మంది చిన్నారులు పంజాబ్‌‌లో మందు తాగుతున్నట్టు వెల్లడైంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌‌ 3.9 శాతంతో రెండో స్థానంలో, మహారాష్ట్ర 3.8 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. క్రిమినల్స్‌‌ కాదు.. పేషెంట్లు నివారణ చర్యల్లో పంజాబ్‌‌ వెనకబడటమే మొదటి స్థానానికి కారణమని సర్వే పేర్కొంది. మందు తాగుతున్న వారిలో సగటున 37 మందిలో ఒకరికి, డ్రగ్స్‌‌ తీసుకుంటున్న వారిలో సగటున 20 మందిలో ఒకరికి ‘మత్తు వదిలించే’ చికిత్స అందడం లేదని చెప్పింది. కేవలం సప్లైని ఆపడానికి చర్యలు తీసుకుంటే సరిపోదని, ప్రభుత్వ విధానాలు మార్చాల్సిన అవసరముందని పేర్కొంది.

డ్రగ్స్‌‌, మందు సప్లై తగ్గించడానికి గట్టి చర్యలు తీసుకోవడం వల్ల జనాలు మరో మార్గం ఎంచుకుంటున్నారు గానీ తీసుకోవడం మాత్రం ఆపడం లేదంది. మత్తుకు బానిసైన వారిని క్రిమినల్స్‌‌గా కాకుండా పేషెంట్లుగా చూడాలని, వారికి సరైన చికిత్స ఇప్పించాలని సూచించింది. అది వీక్‌‌ స్ట్రాటజీ డ్రగ్స్‌‌, మందు వాడుతున్నవారిలో ఎంతమంది వాటికి బానిసలు (ఎడిక్ట్‌‌) అవుతున్నారో మాత్రం సర్వే చెప్పలేదు. ‘ఏదైనా పదార్థానికి అలవాటు పడి బానిసలవ్వాలంటే పదేళ్ల వరకు సమయం పడుతుంది. కాబట్టి మత్తు పదార్థాలు తీసుకుంటున్నవారు దానికి బానిసలవకుండా తగిన చర్యలు తీసుకోవాలి. కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామనడం వీక్‌‌ స్ట్రాటజీ’ అని సర్వే చేసిన వారిలో ప్రముఖ రచయిత అంబేడ్కర్‌ చెప్పారు. మరోవైపు మత్తు పదార్థాలు తీసుకుంటుండటం వల్ల అనారోగ్య సమస్యలూ పెరుగుతున్నాయి. మందు తాగడం వల్ల పాంక్రియోటైటిస్ బారిన పడి ఏటా 150 మంది చికిత్స చేయించుకుంటున్నారు. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతోంది. వ్యాధి వచ్చాక చాలా సంవత్సరాలకు గానీ తెలియకపోవడం వల్ల పంజాబ్‌‌లో ఇలాంటి పేషెంట్లు చాలా ఎక్కువవుతున్నారు’ అని పంజాబ్‌‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధికారులు చెబుతున్నారు.