
మద్యం మత్తులో కారు నడిపి స్నేహితురాలి మృతికి కారణమైన ఐదుగురు యువకులను మాదాపూర్పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జేఎన్టీయూ ప్రాంతంలో ఉండే బస్వధర్మప్రకాశ్ కుమారుడు సచిత్ బాబు(21) గీతం కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. అదే కాలేజీలో చదువుతున్న నిజాంపేటకు చెందిన రాపోలూ భగత్, బీహెచ్ఈఎల్ కి చెందిన మహ్మద్ అఫ్జల్, తలారి ప్రణీత్, తౌటి రాహుల్‌రెడ్డి సచిత్ ఫ్రెండ్స్.
వీరంతా ఆదివారం అర్ధరాత్రి12 గంటల సమయంలో తమ స్నేహితురాలు సాయి విహితతో కలిసి అఫ్టల్ కారులో కేపీహెచ్ బీ నుంచి మాదాపూర్ వెళ్లారు. స్ర్టీట్ డ్రైవ్ ఇన్ హోటల్ సమీపంలోని ఓ ఇంట్లో అంతా మద్యం తాగారు. అనంతరం అక్కడి నుంచి మెహిదీపట్నంలో ఉండే మరో స్నేహితురాలిని కలిసేందుకు బయలుదేరారు. మద్యం మత్తులో సచిత్ బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు. విహిత కారులో సచిత్ పక్కన కూర్చుంది. మిగిలిన నలుగురు వెనుకాల కూర్చున్నారు. మాదాపూర్‌లోని రెట్రో రెస్టారెంట్వద్ద వీరి కారు ఓవర్ స్పీడ్‌తో ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టి, డివైడర్‌పైకి ఎక్కింది. విహిత ఎగిరి రోడ్డు మీద పడగా..
ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ సచిత్బాబుతో పాటు మిగతా నలుగురు యువకులు పారిపోయారు. గాయపడ్డ ఆటో డ్రైవర్ ఇచ్చిన కంప్లయింట్ తో పోలీసులు సోమవారం బీహెచ్ఈఎల్లో ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు.