- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం పోగానే బీఆర్ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని, ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రమంతా వ్యతిరేక పవనాలు వీచినా హైదరాబాద్ లో ఆంధ్రా సెటిలర్లు ఆదరించారని గుర్తుచేశారు. అలాంటి సెటిలర్లను అవమానించే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ బతకడానికి వచ్చినోడు, ఆంధ్రోడు అని కించపర్చే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిపై కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకుని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.