యాదాద్రి జిల్లాలో క్వారంటైన్ కు 58 మంది హ‌‌మాలీ కూలీలు

యాదాద్రి జిల్లాలో క్వారంటైన్ కు 58 మంది హ‌‌మాలీ కూలీలు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా:ఇంత‌వ‌ర‌కు ఒక్క క‌రోనా పాజిటివ్ లేని జిల్లాగా యాదాద్రి భువ‌న‌గిరి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా ల‌క్ష‌ణాలున్న అనుమానితుల‌ను వెంట‌నే హోంక్వారంటైన్ చేస్తున్నారు. అయితే వ‌లిగొండ మండ‌లంలో క‌రోనా పాజిటివ్ ఉన్న వ్య‌క్తి 58 మంది ఉన్న లారీ ఎక్కాడు. దీంతో 58 మందిని అధికారులు వెంట‌నే హోంక్వారంటైన్ కు త‌ర‌లించారు.

వివ‌రాలు

రాజస్థాన్ నుండి వలిగొండకు గన్ని బ్యాగ్స్ లోడ్ తో వచ్చిన లారీలో ఎక్కిన ఒక ప్రయణికునికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ప్రయాణించిన లారీ విషయమై పోలీసులు ఆరా తీశారు. వలిగొండలో ఉన్నట్లు కనిపెట్టి డ్రైవర్, క్లీనర్ లను రంగారెడ్డి జిల్లా రావిరాల క్వారైంటైన్ సెంటరు కు తరలించారు. గన్ని బ్యాగులను అన్ లోడ్ చేసిన 58 మంది హమాలీ కూలీల‌ను కూడా వారి ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంచారు. లారీ డ్రైవర్, క్లీనర్ లకు ముందుగా పాజిటివ్ వా? నెగెటివ్ వా? అనేది తేలాల్సి ఉంది.

ఈ లోపు 58 మందిలో ఈ ఎవరికైనా దగ్గు, జలుబు సమస్యలు తలెత్తితే పరీక్షలు నిర్వహిస్తామ‌ని తెలిపారు అధికారులు. 58 మంది యాదాద్రి జిల్లాకు చెందిన‌వారేన‌ని తెలిపారు. దీంతో యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో అధికారులు అలెర్ట్ అయ్యారు. క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… జాగ్రతలు పాటించాలని.. ఆందోళన చెందవద్దని సూచించారు.