ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్‌లో రెండు దశలుగా జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారాయి. ప్రస్తుతం అస్సాం, పుదుచ్చేరి వంటి చిన్న రాష్ట్రాలను బీజేపీ కూటమి పాలిస్తున్నది. అయితే, ప్రధానమైన కీలక రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లను బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ప్రధానంగా కేంద్రంలోని ప్రతిపక్ష కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి.
ఈ ఐదు రాష్ట్రాలలో మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే 116 మంది ఎంపీలు ఉన్నారు. కానీ, బీజేపీ 24 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. అధికసంఖ్యలో 92 మంది ఎంపీలను ఇండియా అలయన్స్ గెలుచుకుంది. వాస్తవానికి 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ అతిపెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నది.
ఈ ఐదు రాష్ట్రాలలో ప్రధానంగా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఎదగడానికి, అధికారంలోకి రావడానికి బీజేపీ నిరంతరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఆధిపత్యం చెలాయించే ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తోంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టలేని పేలవమైన ఫలితాలు వచ్చినప్పటికీ... హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప విజయాలు సాధించడమే కాకుండా తొలిసారి ముంబై నగరాన్ని కూడా కైవసం చేసుకుంది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ రాణించాలంటే తన పనితీరును మెరుగుపరుచుకోవాలి.
కాంగ్రెస్ కేరళలో గెలిచి అస్సాంలో తన సంఖ్యను మెరుగుపరుచుకుంటే సరిపోతుంది. కానీ, మమతా బెనర్జీ (టీఎంసీ) పశ్చిమ బెంగాల్‌లో, స్టాలిన్ (డీఎంకే) తమిళనాడులలో తప్పక గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. లేదా ఓటమిపాలైతే అది వారికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అంతేకాకుండా మమతా బెనర్జీ, స్టాలిన్ ఓటమి.. ఇండియా కూటమికి కూడా పెద్ద ఓటమిగా నిలుస్తుంది.
కేరళ
కేరళలో బీజేపీ పెద్దగా పురోగతి సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం కేరళలో బీజేపీకి 15% ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా మరో 15% సానుభూతి ఓట్లు కూడా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్ కూటమి, సీపీఎం అలయన్స్‌లు మాత్రమే. క్రైస్తవులు, ముస్లింలు ప్రధానంగా కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తున్నారు. అయితే, మెజార్టీ 60% మంది ఉన్న హిందువులు సీపీఎం, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీ శ్రేణులు, హిందూ ఓటర్లు వ్యూహాత్మకంగా ఓటింగ్ చేయాలని భావిస్తే అది సీపీఎంకు కలిసొచ్చే అవకాశం అవుతుంది. మరోవైపు సీపీఎం కూటమి బలోపేతమైతేనే అధికారం నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కేరళలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల కేరళలో బీజేపీ అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కేరళలో కాంగ్రెస్ పార్టీకి కుమ్ములాటలే ప్రధాన సమస్య కావచ్చు.
తమిళనాడు
2016లో జయలలిత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు డీఎంకే కూడా అలాంటి విజయాన్ని సాధించగలదా అనేది ప్రశ్న. డీఎంకే 20 పార్టీలతో పొత్తు పెట్టుకుంది. తమిళనాడులో అధికార డీఎంకేకు ఎదురునిలిచే ప్రతిపక్షం విభజనకు గురైంది. ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం తమిళనాడు ఎన్నికలకు అనిశ్చితిని జోడించింది. నటుడు విజయ్ డీఎంకే నుంచి ఓట్లను కొల్లగొట్టవచ్చని బీజేపీ కూటమి విశ్వసిస్తోంది. కానీ, తమిళనాడు ఓటర్లు నటుడు విజయ్ పట్ల ఎలా స్పందిస్తారో అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.
తమిళనాడులో అతిపెద్ద పరిణామం ఏమిటంటే డీఎంకే, అన్నాడీఎంకే రెండింటి మిత్రపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరుతున్నాయి. ఈ మార్పు తమిళనాడు రాజకీయ దృశ్యంలో కీలక మార్పును సూచిస్తుంది. ప్రస్తుతానికి డీఎంకే కూటమి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ తమిళనాడులోని 39 పార్లమెంటు స్థానాలను డీఎంకే కూటమి గెలుచుకోవడం గమనార్హం.
అస్సాం
అస్సాం బీజేపీ పాలిత రాష్ట్రం. ఇక్కడ బీజేపీ బలంగా కనిపిస్తోంది. అయితే, బీజేపీ అస్సాంలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాజకీయంగా చతురుడు. అయినప్పటికీ అస్సాంలో 32% మైనారిటీ జనాభా ఉంది. మైనారిటీ ఓటర్లు సాధారణంగా బీజేపీ వ్యతిరేకులు. ఈ నేపథ్యంలో అస్సాంలో ప్రతిపక్షాన్ని వ్యూహాత్మకంగా విభజించడం అధికార బీజేపీకి ప్రయోజనం.
అస్సాం ఒక చిన్న రాష్ట్రమైనప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది రాజకీయంగా కీలకమైనది. ఎందుకంటే ఈ ఐదు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది కేవలం అస్సాంలో మాత్రమే. బీజేపీ అధికారం నిలబెట్టుకోవాలంటే అస్సాంను గెలవాలి. ముఖ్యంగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ఆందోళనలతో రాష్ట్రాన్ని వలసదారుల సమస్య వేధిస్తోంది. ఇది బీజేపీ కథనానికి కేంద్రంగా ఉన్న సమస్య. అస్సాంలో బీజేపీ తన పట్టును కొనసాగించే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్
మమతా బెనర్జీ 2011 నుంచి వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మరోసారి ఆమె అధికారాన్ని నిలబెట్టుకుంటే ఇది వరుసగా ఆమెకు నాలుగో విజయం అవుతుంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే మమతా బెనర్జీ విజయం ఖాయం అనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో టీఎంసీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో బెంగాల్‌లో 30% కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉండటం కూడా మమతకు పెద్ద ఆధిక్యం లభించే అవకాశం ఉంది.
ముస్లిం పాపులేషన్ దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆధిపత్యంలో ఉంది. 2021లో 100 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 30% కంటే ఎక్కువమంది ఉన్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ వాటన్నింటినీ గెలుచుకుంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌లోని 294 నియోజకవర్గాల్లో 200 అసెంబ్లీ సీట్లు మాత్రమే పోటీలో ఉన్నాయి.
2021లో 294 స్థానాలకుగాను 77 స్థానాలను ప్రధాన ప్రతిపక్షం బీజేపీ గెలుచుకుంది. బీజేపీకి ఇది ఒక అద్భుతమైన ఘనత. ఈసారి బీజేపీ తమ సంఖ్యాబలాన్ని మెరుగుపరుచుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయినప్పటికీ మమత ఓడిపోవడాన్ని చూడటం ఇప్పటికీ కష్టమే. ఆమె బెంగాల్‌లో ఆధిపత్య రాజకీయ శక్తిగా కొనసాగుతోంది. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉంది.
పుదుచ్చేరి
పుదుచ్చేరి బీజేపీ కూటమికి చెందిన ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ప్రభావం ఉన్న చిన్న రాష్ట్రం. బలమైన పరిపాలనా వ్యవస్థ, ఓటర్ల బేస్‌ను బట్టి బీజేపీ కూటమి పుదుచ్చేరిని నిలుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, బీజేపీ అస్సాం, పుదుచ్చేరిని గెలవాలి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ 2021లో సాధించిన ఓట్ల సంఖ్యను మెరుగు పరుచుకోవాలి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాష్ట్రాల్లో గణనీయమైన ప్రయత్నాలు చేశారు. కాబట్టి బీజేపీ అభివృద్ధిని చూపించి.. దాని ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని నిరూపించాలి. బీజేపీ వ్యతిరేక నాయకత్వం కూడా తన రాజకీయ ప్రయత్నాలలో అవిశ్రాంతంగా పోరాడుతోంది.
ఇండియా కూటమి అంచనాలు
కాంగ్రెస్ కేరళలో గెలవాలి. ఎందుకంటే గాంధీ కుటుంబం పట్ల అక్కడ సానుకూలత ఎక్కువగా ఉంది. 2021తో పోలిస్తే అస్సాంలో కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుచుకోవాలి. మమతా బెనర్జీ బెంగాల్‌లో విజయ పరంపర ఆధిక్యాన్ని కొనసాగించాలి. మమత ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తే.. విజయం కూడా ఆమె పాలనను కష్టతరం చేస్తుంది.
స్టాలిన్ తమిళనాడులో వరుసగా రెండవసారి అధికారంలోకి రావాలి. డీఎంకే ఓడిపోతే ఆ పార్టీ బలం తమిళనాడులో అతివేగంగా క్షీణించిపోతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం చాలా కష్టపడి పనిచేసింది. కానీ, కష్టపడి పనిచేసినంత మాత్రాన విజయం సాధిస్తుందన్న గ్యారంటీ లేదు.
డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
