19న శనివారం.. ఎల్బీ స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు – అటు వైపు వెళ్లొద్దు

19న శనివారం.. ఎల్బీ స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు – అటు వైపు వెళ్లొద్దు

ఆగస్టు 19 నుంచి మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మైనార్టీల్లోని చిరు వ్యాపారులకు వంద శాతం సబ్సిడీతో ఈ సాయం అందిస్తోండగా.. తొలివిడతగా శనివారం 10 వేల మందికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ కార్యక్రమం శనివారం ఎల్బీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు.. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

ఎల్బీ స్టేడియం దగ్గర ట్రాఫిక్ మళ్లింపులు

  • చాపెల్ రోడ్, నాంపల్లి నుండి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనదారులు ఏఆర్ పెట్రోల్ పంపు వైపు మళ్లించబడతారు. అలాగే, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వైపు నుండి ప్రెస్ క్లబ్/బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వైపు వెళ్లే వాహనదారులు ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్ వైపు వెళ్ళాలి.
  • ఇక రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుండి బీజేఆర్ విగ్రహం/ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వైపు వెళ్లే వాహనదారులు ఫతే మైదాన్ వద్ద ఉన్న సుజాత హైస్కూల్ వైపు వెళ్లాలి. అలాగే, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుండి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. వీరు  నేరుగా ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వరకు వెళ్లి చాపెల్ రోడ్ వైపు వెళ్ళాలి.
  • ఇక ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనదారులను ఓల్డ్ ఎమ్మెల్యే క్యూటిఆర్‌ఎస్ వద్ద హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. అలాగే, కింగ్ కోటి, బొగ్గులకుంట నుండి బషీర్‌బాగ్‌కు వెళ్లే వాహనదారులను కింగ్ కోటి X రోడ్స్ వద్ద తాజ్‌మహల్ లేదా ఈడెన్ గార్డెన్ వైపు మళ్లించనున్నారు.
  • ఇక బషీర్‌బాగ్ నుండి పీసీఆర్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. వీరిని బషీర్‌బాగ్ వద్ద లిబర్టీ వైపు మళ్లించబడతారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

శనివారం కట్ట మైసమ్మ దేవాలయం నుండి ఇందిరా పార్క్ ఎక్స్‌రోడ్ మధ్య స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున ఒక మోస్తరు ట్రాఫిక్ ఉండొచ్చని పోలీసులు  అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు.. ప్రత్యామ్న్యాయ మార్గాలలో ప్రయాణించగలరు. 

వాహనదారులు ఏదైనా అసౌకర్యానికి లోనైనా/ మరింత సమాచారం తెలుసుకోవాలన్నా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ 9010203626లో సంప్రదించవచ్చు.