French Open Men's Final 2026: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ చివరికి చేరుకుంది. నేడు (ఆదివారం) జరగబోయే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో ఇటలీ ఆటగాడు ఫ్లావియో కొబాలితో రెండో సీడ్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పోటీ పడబోతున్నాడు. టెన్నిస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఈ టైటిల్ పోరు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు స్టార్ట్ కానుంది. ఇరువురు ప్లేయర్స్ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
మహిళల సింగిల్స్ విజేతగా రష్యా సంచలనం:
మరోవైపు, శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల రష్యా యువ సంచలనం మిరా అండ్రీవా ఫ్రెంచ్ ఓపెన్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. గెలుపే లక్ష్యంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అండ్రీవా అద్భుత ప్రదర్శన చేయగా.. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన పొలాండ్‌కు చెందిన మయా ఫాలిన్‌స్కాపై 6-3, 6-2తో వరుస సెట్లలో అండ్రీవా గ్రాండ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఈ రష్యా చిన్నది, ఎక్కడా తడబడకుండా వరుస గేమ్స్ లో విజయం సాధించి తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకుంది.
