
- కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ క్రాష్
- పైలెట్తో పాటు ఏడుగురు దుర్మరణం
- మృతుల్లో దంపతులు, రెండేండ్ల కూతురు
- ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్ అడవుల్లో ఘటన
- బ్యాడ్ వెదర్, జీరో విజిబిలిటీనే ప్రమాదానికి కారణం
- ఆరు వారాల్లో ఐదు ప్రమాదాలు.. రెండ్రోజులు చాపర్ సేవలు బంద్
రుద్రప్రయాగ్ (ఉత్తరాఖండ్): చార్ ధామ్ యాత్రలో ఘోరం జరిగింది. భక్తులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ అడవిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్ తో సహా మొత్తం ఏడుగురు చనిపోయారు. వీరిలో దంపతులు, వాళ్ల రెండేండ్ల పాప ఉన్నారు. ‘‘ఆదివారం తెల్లవారుజామున 5:10 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్‌కు చాపర్ బయలుదేరింది. కేదార్‌నాథ్ హెలిప్యాడ్ వద్ద 5:18 గంటలకు ల్యాండ్ అయింది. మళ్లీ 5:19 గంటలకు గుప్తకాశీకి బయలుదేరింది. అయితే వాతావరణం సరిగాలేక గౌరీకుండ్ దగ్గర్లో క్రాష్ అయింది. ఆ వెంటనే పేలిపోయింది. అందులోని వాళ్లందరూ సజీవ దహనమయ్యారు” అని అధికారులు వెల్లడించారు. బ్యాడ్ వెదర్, జీరో విజిబులిటీ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. బెల్ 407 హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దాన్ని ప్రైవేట్ కంపెనీ ఆర్యన్ ఏవియేషన్ నడుపుతున్నదని పేర్కొన్నారు.
‘‘మృతుల్లో బద్రీనాథ్–కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ మెంబర్ విక్రమ్ సింగ్ రావత్ ఉన్నారు. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన రాజ్‌కుమార్ జైస్వాల్, అతని భార్య శ్రద్ధ, రెండేండ్ల కూతురు కాశీతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ దేవీ (66), తుష్టి సింగ్ (19) చనిపోయారు” అని అధికారులు వివరించారు. కాగా, ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విచారణ చేపడుతుందని విమానయాన శాఖ ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంపై హైలెవల్ కమిటీ దర్యాప్తుకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన తెలిపారు. వాతావరణం బాగా లేనందున చార్‌ధామ్ రూట్‌లో ఆది, సోమవారం రెండ్రోజుల పాటు హెలికాప్టర్ సేవలను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెలికాప్టర్ల ఆపరేషన్స్‌కు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్ జారీ చేయాలని, డెహ్రాడూన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి హెలికాప్టర్ల ఆపరేషన్స్‌ను మానిటర్ చేయాలని సూచించారు.
6 వారాల్లో 5 ప్రమాదాలు..
ఏప్రిల్ 30న చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. మే 8న గంగోత్రికి వెళ్తున్న చాపర్ క్రాష్ అయి ఆరుగురు మరణించారు. మే 12న బద్రీనాథ్ నుంచి తిరిగొస్తున్న హెలికాప్టర్‌ను పూర్ విజిబులిటీ కారణంగా ఓ స్కూల్ గ్రౌండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. భక్తులెవరికీ ఏమీ కాలేదు. మే 17న రుషికేశ్ ఎయిమ్స్‌కు చెందిన హెలీ అంబులెన్స్ కేదార్‌నాథ్ హెలిప్యాడ్ వద్ద క్రాష్ ల్యాండ్ అయింది. అందులోని వాళ్లందరూ సేఫ్‌గా ఉండగా, హెలికాప్టర్ డ్యామేజీ అయింది. ఇక జూన్ 7న కేదార్‌నాథ్‌కు వెళ్తున్న చాపర్‌ను టెక్నికల్ ఇష్యూ కారణంగా రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
పైలెట్కు ఆర్మీలో పని చేసిన అనుభవం
చనిపోయిన హెలికాప్టర్ పైలెట్ రాజ్‌వీర్ సింగ్ చౌహాన్ (37) .. ఆర్మీలో 15 ఏండ్ల పాటు సేవలందించారు. హెలికాప్టర్లను నడపడంలో ఆయనకు అపార అనుభవం ఉన్నది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన రాజ్‌వీర్ సింగ్.. 2024 అక్టోబర్ నుంచి ఆర్యన్ ఏవియేషన్‌లో పని చేస్తున్నారు. ఆయన భార్య ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్‌గా పని చేస్తున్నారు. ఈ దంపతులకు నాలుగు నెలల కిందనే ట్విన్స్ పుట్టారు. ఇంతలోనే రాజ్‌వీర్ మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది.