జనవరి 14 నాడు ప్రపంచమంతా ఆలోచించాల్సిన ఒక వార్త వచ్చింది. ఇండియాలో ఈ వార్తను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ వార్తా సంస్థలు ప్రధానంగా ప్రచురించాయి. ముఖ్యంగా ఎన్డీటీవీ ప్రధానంగా దాన్ని విపులంగా బయటపెట్టింది. (ఎన్డీటీవీ అదానీ గ్రూప్‌కి చెందినదని తెలిసిందే). ఈ మధ్య కాలంలో అతి బలమైన అరబిక్ దేశాలన్నీ కలిసి ఒక కొత్త సెక్యూరిటీ అలయన్స్ ట్రీటీపై సంతకాలు చేశాయి. ఈ ట్రీటీ అమెరికా, యూరప్, కెనడా దేశాలు నాటో అనే పేరుతో చేసుకున్న అగ్రిమెంటులాంటిదే. అరబ్ దేశాలన్నీ మతపర థియోక్రాటిక్ రాజ్యాలు. అవి ప్రధానంగా ఖురాన్ సిద్ధాంత ప్రాతిపదికన పరిపాలిస్తాయి. సిందూర్ యుద్ధం (2025) తరువాత పాకిస్తాన్ఇస్లాం మత పునాదిగా అరబ్ లీగ్‌లో చేరిందనే విషయం తెలుసు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, పాక్
యుద్ధాన్ని ఆపానని ప్రకటించి, అది ఆగిపోయిన వారం రోజుల్లోనే సౌదీ అరేబియా వచ్చి పాకిస్తాన్‌కు, సౌదీకి సంధి కుదిర్చాడు. ఆ తరువాత ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యను పరిష్కరిస్తున్నాను అని అనుకోనివిధంగా తన నాయకత్వంలో ఈజిప్టు అగ్రిమెంటుతో అన్ని ముస్లిం దేశాలను ఒకటి చేశాడు. టెర్రరిజం సమస్యకు ముస్లిం దేశాలు మాత్రమే పరిష్కారం (అంటే దాన్ని అంతం చేయడం) కనుక్కోగలవని ట్రంప్ తన సొంత అల్లుడు కుషనర్ (అతను ఒక జ్యు, ఇవాంక భర్త)ను అరబ్ దేశాలను ఐక్యపరిచేందుకు రంగంలోకి దింపాడు. కుషనర్ టీమ్ ఈ కార్యం సాకారం చేయడానికి అరబ్ లీగ్‌ను, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో– ఆపరేషన్ ఉపయోగించారు. ఈ రెండు సంస్థలు రాజ్యాల పరిమితులకతీతంగా మతపరంగా ప్రపంచలోని 56 ముస్లిం దేశాలను
సంఘటితపరిచేందుకు కృషి చేస్తున్నాయి.
పాలస్తీనా సమస్యతోపాటు కాశ్మీర్ సమస్య
ఈ దేశాల మధ్య ఉన్న ప్రధాన సమస్య సున్నీ– షియా తగువును తగ్గించి లేదా ఆపి ఇరాన్ కూడా (ఓఐసీ)లోకి తీసుకురావాలనేది వీటి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని 2001 నవంబర్ 9 (9–11–2001) టెర్రరిస్టు దాడి తరువాత ప్రపంచంలో ముస్లిం దేశాలకు వచ్చిన నష్టాన్ని, దేశాలలోని అంతర్యుద్ధాలను, ఆధునిక విద్యారహిత వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటూనే తమ సమీప దేశాలైన ఇజ్రాయెల్, ఇండియాలను ఎదుర్కోవడం కూడా ఒక లక్ష్యంగా కనిపిస్తుంది.
వీటి చర్చల్లో పాలస్తీనా సమస్యతోపాటు కాశ్మీర్ సమస్య కూడా పదేపదే జోడిస్తున్నారు. గత 75 ఏండ్లుగా కేవలం ఇండియా, పాకిస్తాన్ల మధ్య ఉన్న కాశ్మీర్ సమస్య మునుముందు ‘ఇస్లామిక్ నాటో’ సమస్యగా చేయబోతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఇండియాకు ఇది చాలా పెద్ద కొత్త సమస్యగా మారబోతున్నట్లు కనపడుతుంది. మీడియా వార్తలు చెప్పందేమిటంటే పాకిస్తాన్ న్యూ క్లియర్ శక్తి, సౌదీ అరేబియా ఆర్థిక శక్తి, టర్కీ పదాతి బల (ఆర్మీ శక్తి) ఐక్యమైతే ప్రపంచంలో ఒక కొత్త మతపర ఆర్గనైజ్డ్ యుద్ధ వాతావరణ సృష్టించగల శక్తి ఇది అవుతుంది. అందులో త్వరలో కువైట్, ఇరాన్, ఇండోనేషియా, మలేసియా, బంగ్లా
దేశ్ వంటి దేశాలు కూడా చేరొచ్చు.
ఇస్లామిక్ నాటో
పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ఒక సంఘటిత యుద్ధశక్తిగా ఏర్పడేందుకు సంధి కుదుర్చుకున్నాయి. దీన్ని మీడియా ‘ఇస్లామిక్ నాటో’ అని పిలుస్తున్నా ఇది కచ్చితంగా ఇస్లామిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(ఐటీఓ). ఎందుకంటే నార్త్ అట్లాంటిక్ బయట ఉన్న దేశాలు ఇవి. ఇందులో అన్ని ముస్లిం దేశాలను అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నవాటితో సహా ఐక్యపరిచే అవకాశం ఉంది.
ఇందుకు ఒక కారణం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు సెక్యులరిజంను వదిలేసి మతపర ప్రజాస్వామ్యాలుగా మారుస్తుండటం. ఆ దారిలో ఇండియా కూడా ఉన్నదని వారి అభిప్రాయం. ఇస్లామిక్ ట్రీట్ఆర్గనైజేషన్(ఐటీఓ)లో కలిసే ఎక్కువ ముస్లిం దేశాలు మతపర రాచరికాలు లేదా నియంతృత్వ దేశాలు. వీటి నిర్ణయాలు నాటో దేశంలో ఉన్నట్టు ఉండవు. అవి ఇస్లామిక్ మత పునాదిగా పాలకులు మాత్రమే నిర్ణయిస్తారు. ఆసియా ఖండంలో ముస్లిం దేశాల సంఖ్య ఎక్కువ. మత పునాది రాజ్యాలుగా పరిశీలిస్తే ఆర్థిక శక్తిలో కూడా అవి చాలా బలంగా ఉన్నాయి.
అందుకే కొత్తగా ఏర్పడ్డ ఇస్లామిక్ నాటో, సౌదీ ధనబలం, టర్కీ సైనిక బలం, పాకిస్తాన్ న్యూక్లియర్ ఆయుధ బలం ఐక్యమయ్యాక.. ఒకవేళ ఇటు భారతదేశంతోగాని, అటు ఇజ్రాయెల్‌తో అవి యుద్ధానికి దిగితే ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సీరియస్‌గా చర్చించాల్సిన విషయం. ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ చేసిన యుద్ధంకాని, 1967 అది ఇస్లామిక్ దేశాల మీద చేసిన యుద్ధంగాని, ఈ మధ్య ఇండియా–పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంగాని ఈ కొత్త పరిణామానికి దారి తీసి ఉంటాయి. దురదృష్టవశాత్తు ఆసియా ఖండం తూర్పు భాగంలో ఉన్న బుద్ధిస్టు దేశాల్లో తప్ప మిగతా దేశాల మధ్య ఘర్షణ మతపరమైనదిగా మారుతుంది. భూభాగాల కోసం, లేదా ఆర్థిక సంబంధాల్లో వచ్చిన అంశాలతో వచ్చే యుద్ధాలకంటే మత ఆధారితంగా జరిగే యుద్ధాలు చాలా భీకరంగా ఉంటాయి. డిప్లొమాటిక్ పరిష్కాలకు అక్కడ తావు ఉండదు.
మన సెక్యులర్ వ్యవస్థ రక్షణ కవచం
1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి కాశ్మీర్‌ను ఇండియాలో భాగంగా కాపాడటానికిగాని, బంగ్లాదేశ్‌ను 1971లో పాకిస్తాన్ నుంచి విడగొట్టడానికిగాని అంబేద్కర్ రాసిన సెక్యులర్ రాజ్యాంగం, తరువాత ప్రియాంబుల్ చేర్చిన సెక్యులరిజం పదం బాగా పనికొచ్చాయి. పాకిస్తాన్ తప్ప మిగతా ముస్లిం దేశాలు మనల్ని హిందూ దేశంగాకాని, ఒక హిందూత్వ దేశంగా చూడలేదు. ఇది సెక్యులర్ రాజ్యం. అన్ని మతాలకు సమాన హక్కులు ఉన్నాయి.
కనుక డిప్లొమాటిక్ చర్చల్లో మిగతా ముస్లిం దేశాలన్నీ మన దేశాన్ని శత్రువు క్యాంపులో పెట్టలేదు. ఇండియా–పాకిస్తాన్ మధ్య విభజన సమస్య అయిన కాశ్మీర్ సమస్యకు ముస్లిం దేశాల సపోర్టు పాకిస్తాన్‌కు అంతగా దొరకలేదు. కానీ, ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ ఇండియాను మతరాజ్యంగా చూస్తున్నట్టు కనిపిస్తుంది..? భారతదేశాన్ని హిందూత్వ రాజ్యంగా మార్చాలని వాదించేవారిలో శూద్ర, దళిత, ఆదివాసీ మేధావులు లేరు. ఇందులో ఆ వాదనను బలంగా ముందుపెట్టింది ఆర్ఎస్ఎస్, బీజేపీ మద్దతుదారులైన ద్విజ మేధావులే. దేశం చుట్టూ ఉన్న ముస్లిం దేశాల్లో సెక్యులరిజం రాజ్య సిద్ధాంతంగా ఉండాలనే చర్చ కూడా లేకుండా చూశారు.
కానీ, భారతదేశంలో సెక్యులర్ ఆలోచన విధానానికి పునాదులు వేసి మహాత్మా ఫూలె, అంబేద్కర్, పెరియార్ రామస్వామి వంటి శూద్ర, దళిత మొదటితరం మేధావులు. కుల వ్యవస్థ ఈ దేశంలో సెక్యులర్ రాజ్య నిలకడకు తావివ్వదని వారికి అర్థమైంది. బాల గంగాధర తిలక్, సావర్కర్, గోలవాల్కర్ వంటి బ్రాహ్మణ రచయితలు, నాయకులు సెక్యులర్ వ్యతిరేక మతరాజ్య నిర్మాణం కావాలని రచనలు చేశారు. సంస్థలు నడిపారు. ఫూలే, అంబేద్కర్, పెరియార్, కాన్షీరాం వంటి శూద్ర, దళిత నాయకులు రచనలు, ఉద్యమాలు, రచనలు సెక్యులర్ వ్యవస్థ నిర్మాణం కోసం నడిపారు. రాశారు. అంబేద్కర్ ఆ శక్తుల బలమైన ప్రతినిధి.
ఇస్లామిక్ నాటోను ఇండియా ఎలా ఎదుర్కొంటుంది?
ఇస్లామిక్ నాటో కాశ్మీర్‌పై డిమాండ్‌ను ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఈ ఇస్లామిక్ కూటమిలో కొత్తగా చేరిన టర్కీ ఇప్పటికే ఉనికిలో ఉన్న నాటో కూటమిలో కూడా మెంబర్. అమెరికా సైన్య బలం తరువాత నాటోలో టర్కీ సైన్యమే బలమైంది. అయితే, ఈ కూటమి ముందున్న ప్రధానమైన సవాలు ఈ దేశాల్లో ఉత్పన్నమైన టెర్రరిజాన్ని ఇవి ఎలా ఎదుర్కొంటాయి? ఏ దేశమైనా లేదా కూటమి అయినా దాని మోరల్ పునాది బలంగా ఉండాలి. కమ్యూనలిజం, టెర్రరిజాన్ని ఏ మత ఆధారంగా బలంగా సపోర్టు చేసినా, లేదా ఆ ప్రాక్టీసును అనుమతించినా అంతర్జాతీయ రంగంలో నిలబడటం కష్టం.
ఇండియా కూడా సెక్యులరిజాన్ని వదిలేసి హిందూత్వ రాజ్యంగా రూపొందితే ఆవలి శక్తులు ఈ దేశాన్ని మత పునాదిపై అంచనా వేస్తాయి. ఈ మధ్య కాలంలో ఇక్కడ అధికారంలో ఉన్న రాజకీయ శక్తులు రాజ్యాంగంలోని సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించే ఆలోచన చేస్తున్నారా, దానికి వారు పూనుకుంటే ఇది పూర్తిగా హిందూత్వ రాజ్యంగా మార్చిందనే ఇటు ఇస్లామిక్ దేశాలు అటు క్రిస్టియన్ దేశాలు భావిస్తాయి. ఇస్లామిక్ దేశాల్లాగ క్రిస్టియన్ దేశాలు థియోక్రాటిక్ రాజ్యాలు కావు. అవి మనలా సెక్యులర్ దేశాలు. అందుకే ఇప్పటికీ ఈ దేశాన్ని అవి గౌరవిస్తున్నాయి.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
