కంకాలమ్మ జాతరొచ్చింది

కంకాలమ్మ జాతరొచ్చింది

చుట్టూ పచ్చదనం... మధ్యలో ఒక ఎత్తైన గుట్ట. ఆ గుట్టపై ఎటు చూసినా పారిజాతాల పలకరింపులే. వాటి మధ్య శివపార్వతులు ఇద్దరూ... కంకాలమ్మ, కేతేశ్వరులుగా దర్శనమిస్తారు. ఏటా కార్తీక మాసంలోని చివరి ఆదివారం ఆ గుట్టపై ఘనంగా  జాతర జరుగుతుంది. కనుల పండువగా సాగే ఆ జాతర చూడ్డానికి వేల కిలోమీటర్ల  దూరం నుంచి భక్తులు వస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కార్తీక మాసంలోని చివరి ఆదివారం అంటే ఈ నెల 28న కంకాలమ్మ జాతర జరగబోతోంది. కుమ్రం భీం ఆసీఫాబాద్​ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో జరిగే ఈ 3 రోజుల జాతరకి ఎలా వెళ్లాలి? అసలు ఈ గుట్ట స్పెషాలిటీ ఏంటి? 

రాష్ట్రంలోనే అతిపెద్ద ఏకైక స్వయంభూ ఆలయంగా పేరుంది కంకాలమ్మ కేతేశ్వర గుడికి. ఈ గుడి చుట్టూ పారిజాత చెట్లు కనువిందు చేస్తాయి. గుడి దగ్గరి కొలనులో ఏడాది  పొడవునా నీళ్లుంటాయి. వర్షాలు పడకపోతే అక్కడి రైతులంతా ఈ గుట్ట దగ్గరకే క్యూ కడతారు. బిందెలో నీళ్ళు పట్టుకుని కాలినడకన గుట్ట ఎక్కుతారు. ఆ నీటితో శివ పార్వతులకు అభిషేకం చేస్తే ఆ గుట్ట దిగేలోపు కచ్చితంగా వర్షం వస్తుందని వాళ్ల నమ్మకం. కార్తీక మాసంలోని చివరి ఆదివారం కంకాలమ్మకి పూజలు చేస్తే ఏ కష్టం దరిచేరదని భక్తులు చెబుతారు. ఇన్ని విశిష్టతలున్న ఈ గుడికి ఒక పెద్ద కథే ఉంది.

వాళ్ల భక్తికి మెచ్చి

కొన్ని వేల సంవత్సరాల కిందట కార్తీక మాసంలో శివపార్వతులు ఈ గుడి మార్గం గుండా వెళ్తూ బాగా అలసిపోయారు. దాంతో కాసేపు సేదతీరడానికి ఈ గుట్టపై ఆగారు. అదే సమయంలో అటుగా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తున్న గిరిజనులు శివపార్వతుల్ని చూశారు. ఘనంగా పూజలు చేసి, ఫలహారాలు వండించారు. వాళ్ల భక్తికి మెచ్చిన శివపార్వతులు ఆ గుట్టపైనే కేతేశ్వరుడు, కంకాలమ్మగా వెలిశారు. ఆ చోటు పుణ్యక్షేత్రంగా పేరు తెచ్చుకుంటుందని వరం కూడా ఇచ్చారట. అప్పట్నించి చుట్టుపక్కల గ్రామాల్లోని గిరిజనులు, రైతులు ఈ గుడిలో రోజూ పూజలు చేస్తూ వచ్చారు. గుట్టపై వెలిసిన పరమ శివుడి మహిమలు చూసి పదకొండో శతాబ్దంలో ప్రతాపరుద్రుడు గుడి కట్టించాడు. ఆ తర్వాత నాస్తికుడైన కనకయ్య శివుడి భక్తుడిగా మారి ఈ గుడికి మరో రూపం ఇవ్వడం విశేషం. ఇరవై యేండ్లుగా కార్తీక మాసంలో ఈ గుట్టపై ఘనంగా కంకాలమ్మ  జాతర జరుగుతోంది.  
 
మూడు రోజుల పండుగ

కార్తీక మాసంలోని చివరి ఆదివారం కంకాలమ్మ గుట్టపై పండుగ వాతావరణం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా ఈ జాతరకి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో దాదాపుగా 25,000 మంది భక్తులు పాల్గొంటారు. జాతర రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన  పట్టుబట్టల్లో దర్శనమిస్తారు శివపార్వతులు. ఈ నెల 27న బ్రహ్మ ముహూర్తంలో అంకురార్పణతో ఈ జాతర మొదలవుతుంది. 28న జాతర ప్రధాన ఘట్టం జరుగుతుంది. సోమవారం ముగుస్తుంది. 

అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి

కంకాలమ్మకి మొక్కులు చెల్లించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈసారి ముప్పై వేలమంది భక్తులు జాతరకు వస్తారని అంచనా. ఇప్పటికే జాతరకి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి  చేశాం. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే 20 క్వింటాళ్ల ప్రసాదం పంపిణీ చేయబోతున్నాం. కాశీ, అయోధ్య, బృందావనం నుంచి స్వామీజీలు, సాధువులు ఈసారి జాతరకి వస్తున్నారని చెబు తున్నారు ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య.

ఎలా వెళ్లాలి?

కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా, కౌటాల మండల కేంద్రంలోని కౌటాల గుట్టపై ఈ ఆలయం ఉంది. బస్సు లేదా రైలు మార్గాల్లో కాగజ్​నగర్​ చేరుకుని.. అక్కడ్నించి బస్సు లేదా ఆటోల్లో 40 కిలోమీటర్లు ప్రయాణించి ఈ జాతరకి వెళ్లొచ్చు. 

డి. మహేశ్వర్​ప్రసాద్​, కాగజ్​నగర్​, వెలుగు