
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: సమాజానికి సీనియర్ సిటిజన్ల అనుభవం ఎంతో అవసరమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో రూ.10 లక్షలతో కొత్తగా నిర్మించిన సీనియర్ సిటిజన్స్ ఫోరం బిల్డింగ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం పని చేసే వారిని, నీతిమంతులను ఫోరంలో సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. .
అనంతరం ఓ ఫంక్షన్ హాల్ లోజరిగిన పీఆర్టీయూ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త టెక్నాలజీని వినియోగిస్తూ విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యా వ్యవస్థ గాడిన పడిందన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.