దీపావళి స్పెషల్ నేతకాని బతుకమ్మ..హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామ ఆచారం

దీపావళి స్పెషల్ నేతకాని బతుకమ్మ..హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామ ఆచారం
  •     రేపటి నుంచి నేతకాని కులస్తుల గంగనోముల పండుగ 
  •     మూడు రోజులపాటు ఉత్సవాలు.. చివరి రోజు బతుకమ్మ సందడి

హనుమకొండ/ హసన్ పర్తి, వెలుగు: దీపావళి వచ్చిందంటే చాలు ఆ ఊరిలో బతుకమ్మ సందడి కనిపిస్తుంటుంది. నేతకాని కులస్తులు మూడు రోజులపాటు కేదారీశ్వరుడి వ్రతం చేపట్టడం, పండించిన పంటలు, పిండివంటకాలతో పూజలు చేయడం, చివరి రోజు మగవారే బతుకమ్మ ఆడటం ఇక్కడ కొన్నేండ్లుగా వస్తున్న ఆనవాయితీ. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేటలో నేతకాని కులస్తుల గంగనోముల పండుగ ఇక్కడి ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతుండగా, దీపావళి వచ్చిందంటే సీతంపేట పేరు రాష్ట్రంలోనే సంథింగ్ స్పెషల్ గా వినిపిస్తుంటుంది. 

మూడు రోజుల పండుగ..

కొన్ని తరాల కింద మహారాష్ట్ర నుంచి నేతకాని కులస్తులు ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని సీతంపేటకు వలస వచ్చారు. వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని పిల్లాపాపలను పోషించుకునేవారు. దీపావళి పండుగ వేళ మహారాష్ట్రలో పొలాల అమావాస్య నిర్వహిస్తుండగా, ఇదే సందర్భంలో ఇక్కడి నేతకాని కులస్తులు తమ ఆరాధ్యదైవమైన కేదారీశ్వరుడి వ్రతం చేస్తుంటారు. మూడు రోజులపాటు మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. 

ఉత్సవాల్లో మొదటి రోజు సమీపంలో గంగా(చెరువు) నుంచి రేగడి మట్టిని ఇంటికి తీసుకొచ్చి, దానితో జోడెడ్ల విగ్రహాలు తయారు చేస్తారు. అనంతరం వారు పండించిన ధాన్యంతోపాటు పసుపు, కుంకుమలు, పిండి వంటకాలతో ఆ జోడెడ్లను అలంకరిస్తారు. రెండో రోజు వాటిని ఊరేగింపుగా తీసుకెళ్లి గంగాజలంలో నిమజ్జనం చేస్తుంటారు. దీనినే గంగనోముల పండుగగా పిలుస్తుండగా, ఇలా ప్రత్యేక పూజలతో కేదారీశ్వరుడు పాడిపంటలను సమృద్ధిగా ఉండేలా చూస్తాడని ఇక్కడి నేతకాని కులస్తుల విశ్వాసం. 

మగవారే ఆడిపాడే బతుకమ్మ..

ఉత్సవాల్లో మూడో రోజు నేతకాని కులస్తులంతా వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేరుస్తారు. అనంతరం నేతకాని కులంలోని మగవారంతా బతుకమ్మ పాటలు పాడుతారు. మొదట్లో కేవలం మగవారు మాత్రమే బతుకమ్మ ఆడేవారు కాగా, కాలక్రమేణా మహిళలు కూడా వీరితో జత కట్టి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేయడం మొదలైంది. ఆ తర్వాత రోజు గంగనోముల పండుగను ముగించి, ఒక్కపొద్దులు విడుస్తారు. ఇలా మూడు రోజులపాటు జరిగే ఈ పండుగ సీతంపేటకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

రేపటి నుంచి ఉత్సవాలు షురూ..

గంగనోముల పండుగలో భాగంగా నేతకాని కులస్తులు మంగళవారం కేదారీశ్వరుడి పూజలు ప్రారంభిస్తారు. రేగడి మట్టితో ఎడ్ల బండ్లు తయారు చేసి, ధాన్యం, పిండివంటకాలతో అలంకరిస్తారు. బుధవారం వాటి నిమజ్జన కార్యక్రమం నిర్వహించి, గురువారం బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తారు. ఈ మేరకు నేతకానిల బతుకమ్మ పండుగకు సన్నద్ధమవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.