
- ఫార్వార్డ్ కులాలను దూషిస్తూ ప్రసంగాలు మానుకోండి
- 18 ఫార్వార్డ్ క్యాస్ట్ల ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో అగ్రకులాలు వ్యతిరేకం కాదని 18 ఫార్వార్డ్ క్యాస్ట్ల ప్రతినిధులు స్పష్టం చేశారు. అగ్రకులాలు వ్యతిరేకం అనే తప్పుడు ప్రచారం ఆపాలని కోరారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫార్వార్డ్ క్యాస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఆయా కులాల ప్రతి నిధుల రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, వైశ్య, బ్రహ్మణ, క్షత్రియ, బలిజ, ఒంటరి, తెలగ, ముస్లిం, సిక్కులు, మార్వాడీ, బౌద్ధ, జైన, రాజ్‌పుత్, జాట్, పటేల్ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కొంత కాలంగా ఫార్వార్డ్ కులాలను దూషిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని.. వాటిని మానుకోవాలని ప్రతినిధులు కోరారు. ఈ వ్యాఖ్యల వల్ల కుల విద్వేషాలు మరింత పెరుగుతాయని తెలిపారు. అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని ఈబీసీలు కోరుతున్నామన్నారు.
రిజర్వేషన్ల వివాదంలో అగ్రకులాల పార్టీల నేతలపై దాడులు కరెక్ట్ కాదని ఆయన అన్నారు. సమావేశంలో కమ్మ సంఘం అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ రావు, వెలమ సంఘం నుంచి నీలగిరి దివాకర్ రావు, వైశ్య సంఘం నుంచి యాదగిరి గుప్త, బ్రహ్మణ సంఘం నుంచి పోచంపల్లి రమణరావు పాల్గొన్నారు.