
వనపర్తి, వెలుగు: బీసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఆదివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇందిరా పార్క్, గాంధీ చౌక్, పాత బజార్, బస్టాండ్, మర్రికుంట మీదుగా కొనసాగింది. అన్ని సంఘాలు ఒకే గొడుగు కిందకు వచ్చి బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకువెళ్తామని, జిల్లా జేఏసీ ఏర్పాటు చేసి మరింత బలంగా బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం 9వ షెడ్యూల్ లో చేర్చితే తప్ప చట్టబద్ధత లభించదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ బీసీలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ద్వంద్వ వైఖరి అవలంభించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రిజర్వేషన్ల అమలుతోనే సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదగవచ్చని తెలిపారు. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్, నాయకులు గట్టు యాదవ్, సతీశ్ యాదవ్, పగిడాల శ్రీనివాస్, పలుస రమేశ్ గౌడ్, వాకిటి శ్రీధర్, అర్జున్ యాదవ్,ఉద్యోగ జేఏసీ నాయకులు కురుమన్న, సత్యనారాయణ, మల్లేశ్, కిరణ్ పాల్గొన్నారు.