
హైదరాబాద్: భక్తులంతా సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించండని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం (మే 15) నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి నదిలో మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి పుణ్యస్నానమాచరించారు. తర్వాత ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించి.. సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక, మంథని ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంథని నుంచే పీవీ నరసింహారావు దేశానికి సేవ చేశారని గుర్తు చేశారు.
పీవీ తర్వాత శ్రీపాదరావవు స్పీకర్గా అద్భుతంగా పని చేశారని కొనియాడారు. శ్రీపాదరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన కుమారుడు, మంత్రి శ్రీధర్ బాబు ప్రజ సేవ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో శ్రీధర్ బాబు కృషి ఎనలేదని ప్రశంసించారు. రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం టెంపుల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఇవ్వండని అధికారులను ఆదేశించారు.
కాగా, ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజులపాటు సరస్వతీనది పుష్కరాలు వైభవంగ జరుగనున్నాయి . ఈ సమయంలో సరస్వతి నదితీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం సరస్వతి నది పుష్కరాలకు సిద్దమవుతుంది.
తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతినదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు సిద్దమవుతున్నారు. ఈ పుష్కరాలు కాళేశ్వరం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. టెంపుల్ టూరిజంపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తిని కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
సరస్వతి నది పుష్కరాలు జరిగే ప్రదేశాలు
తెలంగాణా రాష్ట్రంలోని కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలోను సరస్వతీ నదీ పుష్కరాలు జరుగుతాయి. సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని "మన" అనే గ్రామంలో పుట్టింది. అయితే ఈ నది అంతర్వాహిని. అందువల్ల సరస్వతి నదీ పుష్కరాలు "మన" లో జరుగుతాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. నదిలో సమృద్ధిగా నీళ్లు ఉండి, పుష్కరాలు విజయవంతంగా జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.