
- తక్కువ టైమ్ లోనే పార్టీ హై కమాండ్ దృష్టిలో
- ఇటీవలే జాతీయ చానెల్ కు ఇంటర్వ్యూ
- మోదీ మెచ్చుకోవడంతో అందరి చూపు ఆమె మీదే
హైదరాబాద్,వెలుగు : హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై అందరి దృష్టి పడింది. ఫిబ్రవరి వరకూ రాజకీయంగా పెద్దగా పరిచయంలేని ఆమె..ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చుకునేలా మారిపోయారు. ఓ జాతీయ ఛానల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడిన తీరుకు ప్రధాని నరేంద్ర మోదీ కితాబివ్వడంతో దేశవ్యాప్తంగా ఆమె పేరుచర్చనీయాంశంగా మారింది. అలాగే ఆమెకు వై పస్ల్ కేటగిరి భద్రత కేటాయించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ స్థానంలో పాగా వేసేందుకు బీజేపీ చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది.
ప్రతీసారి బీజేపీ నేతలకే టికెట్లు ఇస్తూ వచ్చిన హై కమాండ్.. ఈ ఎన్నికల్లో మాత్రం రూటు మార్చింది. పాతబస్తీలో పలు కార్యక్రమాలు చేపడుతూ, ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ హాస్పిటల్ చైర్మన్ గా ఉన్న కొంపల్లి మాధవీలతను బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. కొన్నేండ్లుగా లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా ఆమె పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తికి సీటు ఇవ్వడంపై విమర్శలు రావడంతో పాటు పలువురు నేతలు అలకబూనారు. అయినా, ఆమె సోషల్ మీడియా, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన ప్రచారాన్ని సాగిస్తున్నారు మాధవీలత.
కట్టు, బొట్టుతో ఆకట్టుకుంటున్న అభ్యర్థి
భరతనాట్య కళాకారిణి, గాయనిగా పేరుపొందిన మాధవీలత.. తన వేషధారణ, మాట్లాడే భాషతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలోనే తక్కువ సమయంలోనే ఆమె బీజేపీ హై కమాండ్ దృష్టిలో పడ్డారు. ఇటీవల ఓ చానెల్ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడిన తీరుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గతంలోనూ హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ బూత్ లెవెల్ ఇన్ చార్జీల సమావేశంలో
ఆమె మాట్లాడి హోం మంత్రి అమిత్ షా మన్ననలు కూడా పొందారు. కాగా, ప్రచారంలో ఆమెకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆమెకు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. దీంతో మరోసారి రాష్ట్రంలోని బీజేపీలో ఆమె సంచలనంగా మారారు.