శివబాలకృష్ణ అక్రమాస్తులన్నీ బినామీల పేర్లతోనే.. మూడు శాఖల్లో క్విడ్ ప్రో కో

శివబాలకృష్ణ అక్రమాస్తులన్నీ బినామీల పేర్లతోనే.. మూడు శాఖల్లో క్విడ్ ప్రో కో

హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ మాజీ డైరెక్టర్‌‌, రెరా సెక్రటరీ‌‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా బయటకొచ్చింది. ఆయనకు 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్స్‌‌, విల్లాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 
 
శివబాలకృష్ణకు బినామీగా ఉన్న ఆయన సోదరుడు శివ నవీన్‌‌కుమార్‌‌‌‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. మరో బినామీగా ఉన్న ఆయన మేనల్లుడు భరత్‌‌కుమార్‌‌‌‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో మేనల్లుడు, బాలకృష్ణ భార్య రమాదేవి, నవీన్ భార్య పేరుతో సహా బంధువులు, స్నేహితులపేర్లతో బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

మూడు శాఖల్లో క్విడ్ ప్రో కో

హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా, రెరా ఇన్​చార్జి సెక్రటరీగా, మెట్రో రైల్‌‌ చీఫ్ జనరల్ మేనేజర్‌‌‌‌గా విధులు నిర్వహించిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. క్విడ్ ప్రో కో తరహాలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. హెచ్‌‌ఎమ్‌‌డీఏ, రెరా, మెట్రో రైలులోని శివబాలకృష్ణ చాంబర్స్‌‌లో సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. హెచ్‌‌ఎమ్‌‌డీఏ పరిధిలోని ఔటర్‌‌‌‌ రింగ్‌‌ రోడ్డు, రీజినల్ రింగ్‌‌ రోడ్డు పరిసర ప్రాంతాలు సహా పుప్పాలగూడ, నార్సింగిలోని ప్రాజెక్ట్‌‌లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.